బ్రకోలి తిన్నారా? మిడ్ నైట్ ఇద్దరిని చంపేసిన బ్యాక్టీరియా!
ప్రతిరోజు ఉదయం అల్పాహారం మొదలు మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా బయటే తినేవాళ్లున్నారు.;
ప్రతిరోజు ఉదయం అల్పాహారం మొదలు మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా బయటే తినేవాళ్లున్నారు. ఆదాయాలు గణనీయంగా పెరిగిన ఈ అధునాతన ప్రపంచంలో బయటి తిండికి ప్రజలు అలవాటు పడ్డారు. దీనివల్ల ఫుడ్ బిజినెస్ లాభదాయకంగా మారింది. చిన్న ఫుడ్ ట్రక్కుల్లో సైతం భారీగా ఆర్జిస్తున్నారు. అయితే ఈ ఆహారంలో హైజీనిక్ ఎంత? అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం.చాలా చోట్ల కనీస శుభ్రత పాటించని హోటల్లే ఇప్పుడు ఎక్కువ. శుచి శుభ్రత లేని ఆహారాన్ని రుచికరం అని భావించి తినేవారికి ఇప్పుడు కనువిప్పు కలిగించే పరిశోధనలు వున్నాయి.
తాజాగా దక్షిణ ఇటలీలో బ్రకోలి శాండ్ విచ్ కొనుగోలు చేసి తిన్న కారణంగా ఇద్దరు మరణించారు. ఇందులో బోటులిజం అనే ఇబ్బందికర అనారోగ్యం మరణాలకు దారి తీసింది. దీనికి కారణం కలుషితాహారం. దానిని తయారు చేసిన విధానం. ఎండలో ఎక్కువ సేపు ఉంచిన బ్రకోలిని ఉపయోగించిన కారణంగా దానిలో బాక్టీరియా కూడా అభివృద్ధి చెందింది. విపరీతమైన విరేచనాలతో మొదలయ్యే ఈ రోగం వేగంగా ప్రాణాంతకంగా మారుతుంది. సరైన సమయంలో సరైన చికిత్స అందకపోతే మరణ శాసనమే. అందుకే ఇటలీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒకరు తన సోదరి బలవంతం చేయడంతో క్లినిక్ కి వెళ్లి బయటపడగలిగింది. విరేచనాలతో ఆస్పత్రికి చేరుకున్న ఈ యువతిని వెంటనే పెద్దాస్పత్రికి తరలించగా పెను ముప్పు గా మారిన బోటులిజం బయటపడింది. అయితే అక్కడ శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపించే చికిత్స జరిగింది. అలా ఆమె బయటపడింది. కాలాబ్రియాలోని డయామంటేలోని సముద్ర తీరంలో పనిచేస్తున్న ఫుడ్ ట్రక్కులో బోటులిజం బ్యాక్టీరియా బయటపడింది.
అయితే బయట ఆహారాన్ని తిన్నప్పుడు అపరిశుభ్రత కారణంగా ఎలాంటి బ్యాక్టీరియాలు, వైరస్ లు అయినా మానవ శరీరంలోకి ప్రవేశించేందుకు ఆస్కారం లేకపోలేదనేది అందరికీ తెలిసినదే. కానీ పెద్ద గుణపాఠం అయ్యాకే జాగ్రత్త పడతారు. బోటులిజం అనేది నాడీ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పక్షవాతం, శ్వాసకోశ కండరాల వైఫల్యం, మరణానికి దారితీసే క్లోస్ట్రిడియం బోటులినం అనే బాక్టీరియం ఉత్పత్తి చేసే టాక్సిన్ వల్ల కలిగే ప్రమాదకరమైన అనారోగ్యం. ఇది చాలా అరుదు కానీ.. తక్షణ చికిత్స లేకపోతే ప్రాణాంతకం. కలుషితమైన ఆహారం, సోకిన గాయాలు లేదా శిశువులలో, పేగుల్లో బాక్టీరియా గుడ్లు పెరిగినప్పుడు ఇది అభివృద్ధి చెందుతుంది. ఫుడ్‌బోర్న్ బోటులిజం లక్షణాలు పరిశీలిస్తే, మింగడానికి లేదా మాట్లాడటానికి ఇబ్బంది, నోరు ఎండిపోవడం, ముఖం రెండు వైపులా బలహీనత, అస్పష్టంగా లేదా రెండుగా కనిపించడం, కనురెప్పలు వంగిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, పక్షవాతం వంటి చాలా ప్రమాదాలున్నాయి.