రఘురామరాజుపై సీబీఐ కేసు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
రఘురామకృష్ణంరాజు చైర్మనుగా ఉన్న ఇండ్ భారత్ కంపెనీ, దీని అనుబంధ సంస్థలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కోట్ల రూపాయల నిధులను రుణంగా సేకరించాయని అంటున్నారు.;
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడేళ్ల క్రితం రఘురామకృష్ణంరాజుపై సీబీఐ విచారణపై స్టే విధిస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది. అక్రమ పద్ధతుల్లో బ్యాంకు రుణాలు తీసుకోవడంతోపాటు, రుణాల ఎగవేతపై రఘురామకృష్ణంరాజుపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసిందని అంటున్నారు. సీబీఐ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రఘురామరాజు కూడా న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో 2022లో సుప్రీం ఇచ్చిన స్టేను ఉపసంహరించుకోవడంతో ఇప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొందని అంటున్నారు.
రఘురామ కేసులపై మంగళవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ ధర్మాసనం విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో నిందితులకు ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇదే సమయంలో బ్యాంకులు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్, ఎఫ్ఐఆర్ లో ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం కోర్టులను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ పరస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతోపాటు ఆయన చైర్మనుగా ఉన్న ఇండ్ భారత్ కంపెనీకి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఉన్న వివాదం మలుపుతిరిగినట్లు భావిస్తున్నారు.
రఘురామకృష్ణంరాజు చైర్మనుగా ఉన్న ఇండ్ భారత్ కంపెనీ, దీని అనుబంధ సంస్థలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కోట్ల రూపాయల నిధులను రుణంగా సేకరించాయని అంటున్నారు. ఈ రుణాలలో సగానికి పైగా మొత్తం బ్యాంకులకు తిరిగి చెల్లించగా, కొంత మొత్తం బకాయి ఉండిపోయిందని, అయితే బ్యాంకులకు తాను చెల్లించాల్సిన మొత్తానికి కన్నా ఎక్కువగా తనకు విద్యుత్ సంస్థల నుంచి రావాల్సివుండటంతో అప్పట్లో బకాయిలు చెల్లించలేకపోయామని రఘురామరాజు చెబుతున్నారు. దీనిపై గతంలోనే మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ దర్యాప్తు కూడా పూర్తి చేసిందని రఘురామ తెలిపారు. ప్రస్తుత సుప్రీం ఆదేశాల వల్ల ఇబ్బందేమీ లేదని, బ్యాంకులకు తాను చెల్లించాల్సిన మొత్తం కన్నా, ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన మొత్తమే ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.
ఇక రఘురామ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఈ విషయమై రాజకీయ దుమారం రేగుతోంది. రఘురామకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడిందని వైసీపీ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ రఘురామను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. రఘురామ ఫిర్యాదుపై దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు.. మంచిదే, మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా..? అని పీవీ సునీల్ కుమార్ ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా ఛానల్ లో వచ్చిన వీడియోని పోస్ట్ చేస్తూ సునీల్ కామెంట్ చేసారు.