సంతోషం జగన్మోహనరెడ్డి... డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రికలో తనకు ఇచ్చిన స్పేస్ చూస్తుంటే.. జగన్ కు బాగా మండుతున్నట్లు ఉందని రఘురామ వ్యాఖ్యానించారు.;
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. జగన్ తోపాటు సాక్షి పత్రికపైనా రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రభావంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకు చెందిన కంపెనీలపై కూడా చర్యలు ఉండే అవకాశం ఉందంటున్నారు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి చెందిన కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై కొనసాగుతున్న వివాదంపై సుప్రీం తీర్పు రాగా, సాక్షి పత్రికలో తన ఫొటోను వేసి, తననే టార్గెట్ చేస్తూ వార్తలు రాయడాన్ని ప్రస్తావిస్తూ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రికలో తనకు ఇచ్చిన స్పేస్ చూస్తుంటే.. జగన్ కు బాగా మండుతున్నట్లు ఉందని రఘురామ వ్యాఖ్యానించారు. ఈ కథనాల ద్వారా జగన్ పతనానికి తానే కారణమని కన్ఫార్మ్ చేశారని రఘురామ అన్నారు. ‘‘సంతోషించే అంశం ఏంటంటే.. అతడు పతనానికి కారణం నేనే నేనే అని భలే కన్ఫార్మ్ చేశాడు’’ అంటూ రఘురామ అన్నారు. ఒక కామన్ జడ్జిమెంట్ విషయంలో నా బొమ్మ వేశారు. ఫస్ట్ పేజీలో.. తర్వాత పేజీలో పెద్ద కథనం రాశారు. ఇది చూస్తుంటే భలే మంట ఉంది కదా బాబూ నీకు, ఏదైనా నీ పతనానికి కారణం నేనే అని నిరూపించినందుకు సంతోషం జగన్మోహనరెడ్డి అంటూ రఘురామ అన్నారు.
ఇదే సమయంలో తాను జగన్మోహనరెడ్డి అంటూ ఏకవిచనంలో పిలవడంపైనా రఘురామ వివరణ ఇచ్చారు. తాను డిప్యూటీ స్పీకర్ హోదాలో మాట్లాడటం లేదని, డిప్యూటీ స్పీకర్ గా మాట్లాడితే మా ఎమ్మెల్యేగా జగన్మోహనరెడ్డి అనేవారినని అన్నారు రఘురామ. తనకు ఎక్కువ ప్రచారం కల్పించిన సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. మరోవైపు తనను టార్గెట్ చేస్తూ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ట్వీట్ చేయడాన్ని రఘురామ ప్రస్తావించారు. నేడో రేపో సునీల్ కుమార్ అరెస్టు అవ్వనున్నారని వెల్లడించారు.
ఇక రఘురామకు చెందిన కంపెనీల రుణ వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టులో తీర్పు వెలువడింది. దీనిని వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రధానంగా సాక్షిలో పెద్ద వార్తా కథనం ముద్రించడంపై రఘురామ ఆక్షేపించారు. బుధవారం మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలో తనపై సుప్రీం ఇచ్చిన తీర్పును పరిష్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్మోహనరెడ్డితోపాటు సునీల్ కుమార్ పైనా రఘురామ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పెట్టిన కేసుపైనే ఇప్పుడు తీర్పువచ్చిందని రఘురామరాజు చెప్పారు.