విజయ్ సంచలన ప్రకటన.. తమిళ రాజకీయాల్లో కొత్త మలుపు!
తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేయాలని భావిస్తున్న టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్ తన ఎన్నికల వ్యూహంపై స్పష్టతనిచ్చారు.;
తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేయాలని భావిస్తున్న టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్ తన ఎన్నికల వ్యూహంపై స్పష్టతనిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో టీవీకే చేరుతుందని వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నామని వెల్లడించారు. తమిళ రాజకీయాల్లో తానే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉంటానని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సినీ నటుడిగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ ఫేవరేట్ గా రంగంలోకి దిగుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో టీవీకే అధిపతి విజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. విజయ్ తన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, బీజేపీ భావజాలం పరస్పర విరుద్ధమని వ్యాఖ్యానించారు. దీంతో కొద్ది రోజులుగా బీజేపీతో విజయ్ చేతులు కలపనున్నారని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లుందని అంటున్నారు. ఎన్డీఏలో చేరడం వల్ల పార్టీ అస్తిత్వం దెబ్బతింటుందని, అలాగే తమిళనాడులో ఉన్న ద్రవిడ ఓటు బ్యాంక్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని విజయ్ భావిస్తుండటం వల్లే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
రెండు పెద్ద శక్తులకు దూరం
అదేవిధంగా తమిళనాడులో రెండు ప్రధాన రాజకీయ పక్షాలుగా వ్యవహరిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సమదూరం పాటించాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. డీఎంకే వారసత్వ రాజకీయాలు చేస్తోందని విజయ్ విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఏఐఏడీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న బీజేపీతో కలిసి పనిచేయడానికి విజయ్ వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం విజయ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు. ద్రవిడ ఓటు బ్యాంక్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన రెండు పార్టీలకు సమదూరం పాటించాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
తమిళనాడులో 'హిందీ వ్యతిరేక', 'రాష్ట్ర స్వయం ప్రతిపత్తి' అనేది సెంటిమెంట్ గా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో జతకడితే ఆ సెంటిమెంట్ దెబ్బతింటుందని, ఓట్ల వేటలో తాను వెనకబడతానని విజయ్ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఎవరితో కలవకుండా ఒంటరి పోరాటం చేయడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో టీవీకే పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టత ఇవ్వడం ద్వారా ఎన్డీఏ కూటమికి దూరంగా ఉంటానని చెప్పడమే అని అంటున్నారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడులోని మిగిలిన పార్టీలకు సవాలుగా మారుతుందని చెబుతున్నారు.