ఆధార్ తో పాన్.. తుది గడువు మార్చి 31 వరకే అవకాశం
గడిచిన కొన్నేళ్లుగా ఉంటున్న కొన్ని నిబంధనలు ఇటీవల కాలంలో మారుతున్న సంగతి తెలిసిందే.;
గడిచిన కొన్నేళ్లుగా ఉంటున్న కొన్ని నిబంధనలు ఇటీవల కాలంలో మారుతున్న సంగతి తెలిసిందే. నిబంధనల్ని మరింత కఠినం చేయటంతో పాటు.. తప్పులు జరగటానికి వీల్లేని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడా వరుసలోనే మరో కీలక నిర్ణయం తీసుకోవటం.. ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రావటం తెలిసిందే. ఇప్పటివరకు ఆధార్ తో పాన్ ను పొందే అవకాశం ఉంది. అయితే.. ఈ అవకాశం ఈ నెల 31 వరకు మాత్రమే. అంటే.. ఎవరైనా ఆధార్ కార్డు సాయంతో పాన్ పొందే వీలుంది. కాకుంటే.. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
ఎవరైనా ఆధార్ తో పాన్ కార్డు పొందాలనుకుంటే.. పాత పద్దతి కేవలం ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత నిబంధనలు మారటంతో పాటు.. మరిన్ని ధ్రువపత్రాలు అవసరమవుతాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాల్ని కేంద్రం తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టులో స్పష్టం చేసింది.
బ్యాంకింగ్.. ఆర్థిక లావాదేవీలకు కీలకమైన పాన్ పొందాలనుకుంటే ఏప్రిల్ 1 నుంచి ఆధార్ తో పాటు అదనపు డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. పుట్టిన తేదీని ధ్రువీకరించే పత్రాలు ఇందుకు అవసరమవుతాయి. బర్త్ సర్టిఫికెట్.. ఓటర్ ఐడీ కార్డు.. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్.. డ్రైవింగ్ లైసెన్స్ .. అఫిడవిట్.. పాస్ పోర్టు వంటి పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత అప్లికేషన్ రూపురేఖలు కూడా మారనున్నాయి. ఆన్ లైన్ లో కొత్త పాన్ కార్డు కోసం సంబంధిత వెబ్ సైట్లను సందర్శించాల్సి ఉంటుంది. అలా కాకుండా తక్షణమే ఈ-పాన్ పొందాలనుకుంటే ఆధాయపన్ను ఈ- ఫైలింగ్ పోర్టులో కూడా పొందే వీలుంది. ఒకే వ్యక్తికి ఒకటికి మించిన పాన్ కార్డులు ఉండటం.. డేటాలో వ్యత్యాసాలు లాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా ఆదాయపన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.