ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం...ఎందుకలా ?

దేశంలో బీజేపీ మూడవసారి వరసగా అధికారం అందుకుంది. అయితే లోటు ఏమిటి అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కలేదు.

Update: 2026-08-03 18:30 GMT

దేశంలో బీజేపీ మూడవసారి వరసగా అధికారం అందుకుంది. అయితే లోటు ఏమిటి అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. 240 నంబర్ దగ్గరే ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ అయిన 273 కి 33 సీట్లు పక్కాగా తగ్గాయి. అయితే ఎన్డీయే మిత్రులు మంచి సంఖ్యతో సీట్లు సాధించడంతో మూడవసారి మోడీ ప్రధాని అయ్యారు. అయితే బీజేపీ పెద్దలకు ఇది ఒక అసంతృప్తిగానే ఉందని అంటున్నారు. ఇక 2024 నుంచి చూసుకుంటే దేశంలో జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి జెండా గట్టిగా పాతింది.

చాప కింద నీరులా :

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. అలాంటి చోట కూడా 200 ప్లస్ సీట్లతో అదిరిపోయే సక్సెస్ ని సొంతం చేసుకుంది. బీహార్ లో తమ పార్టీ నేతను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. ఇన్ని జరిగినా బీజేపీ మీద ఉన్న అసంతృప్తి మెల్లగా జనంలో ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉంది. తాజాగా బీహార్ లోని బకింపూర్ ఉప ఎన్నికల ఫలితం అయితే బీజేపీకి భారీ షాక్ కొట్టించింది. దాంతో పాటు ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్ధుల ఆందోళన అయితే బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. ఏకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. జెన్ జీ తరం ఆగ్రహంగా ఉందని అర్ధం అవుతోంది అంటున్నారు. దాంతో బీజేపీ పెద్దలలో అంతర్మధనం మొదలైంది అన్న మాట వినిపిస్తోంది.

డీలిమిటేషన్ బిల్లు సంగతి :

ఇక బీజేపీ ఎన్నో ఆశలు పెంచుకుని ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంట్ లో ఆమోదించుకోవాలని చాలా వ్యూహ రచన చేసింది. అనేక పార్టీలను చీల్చింది. కొన్ని పార్టీలను దగ్గర చేసింది. ఇంత చేసినా వర్షాకాల పార్లమెంట్ నడవడం లేదు, పైగా మద్దతుగా నిలుస్తుంది అనుకున్న డీఎంకే కూడా హ్యాండ్ ఇచ్చింది అని అంటున్నారు. ఈ పరిణామాల పట్ల బీజేపీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. డీలిమిటేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే ఆటోమేటిక్ గా మహిళా బిల్లు పొందుతుంది. అపుడు వచ్చే ఏడాది జరగనున్న యూపీ తదితర రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయించి డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టిన తరువాతనే నిర్వహించాలని అనుకున్నారు. ఎందుకంటే పదేళ్ళ పాటు బీజేపీ యూపీలో అధికారంలో ఉంది. దాంతో అక్కడ యాంటీ ఇంకెంబెన్సీ ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే ఇపుడు ఆ చాన్స్ ఏదీ లేదని అంటున్నారు. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు ముందుకు వెళ్ళేందుకు ఆస్కారం పార్లమెంట్ లో లేదని విశ్లేషిస్తున్నారు.

యూపీ ఎన్నికలు జరిగితే :

ఇక వచ్చే ఏడాది ప్రథమార్ధంలో యూపీ ఎన్నికలు జరిగితే కనుక బీజేపీకి చేదు ఫలితాలు వస్తాయన్న ఆందోళన ఉంది. అదే జరిగితే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఆ ప్రభావం పడుతుందని అసలే మెజరిటీ తక్కువై మిత్రులతో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పెద్దలకు అన్ని వైపుల నంచి కొత్త్ తలనొప్పులు వస్తాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందని వేళ కొత్త వ్యూహాలకు బీజేపీ పెద్దలు తెర తీస్తారా అన్న చర్చ సాగుతోంది. అందులో నుంచి పుట్టుకుని వచ్చిందే ఈ ముందస్తు ఎన్నికల ప్రచారం అని అంటున్నారు.

రెండేళ్ళు ముందుగానా :

యూపీ ఎన్నికలతోనే లోక్ సభకు కూడా ఎన్నికలు జరిపించాలని ఒక ఆలోచన కేంద్ర బీజేపీ పెద్దలకు ఉందని ఊహాగానాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఆ విధంగా చేయడం ద్వారా జాతీయ అంశాలను యూపీలో ముందుంచి మరోసారి అక్కడా కేంద్రంలో గెలించేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందించవచ్చు అన్నది అయితే ప్రచారంలో ఉన్న మాటగా చెబుతున్నారు. అయితే రెండేళ్ళ ముందు ఎన్నికలు పెట్టినా అనుకున్నది జరగకపోతే అపుడు రెండిందాలుగా కూడా చెడిన తీరు అవుతుందని అంటున్నారు. పైగా ముందస్తు అంటే మిత్రులతో పాటు అంతా ఒప్పుకోవాల్సి ఉంటుందని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా దేశంలో గాలి అయితే మారుతోంది అన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. అలాంటపుడు 2029 ఎన్నికల దాకా బీజేపీ అధికారంలో కొనసాగి ఆ మీదట ఫలితాలు ఎలా ఉన్నా కూడా స్వీకరించే విధంగా ముందుకు సాగితేనే మేలు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి గాసిప్పులుగా ఊహాగానాలుగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ముందస్తు ఎన్నికలు అన్నవి నిజంగా కార్యరూపం దాలుస్తాయా అన్నది.

Tags:    

Similar News