వావ్ అనిపించే స్నేహితులు.. అభ్యర్థి తరఫున హామీ ఇచ్చేశారు
పంచాయితీ ఎన్నికల బరిలో ఫ్రెండ్ నిలిచిన వేళ.. అతడికి పూచీకత్తుగా అతడి స్నేహితులు నిలవటం.. ఓటర్లకు వ్యక్తిగతంగా హామీ ఇవ్వటం ఆకట్టుకుంటోంది. అసలేం జరిగిందంటే..;
తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల వేళ.. అనూహ్య సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నడుస్తున్నకాలంలో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్నేహితుడి కోసం.. స్నేహధర్మంలో భాగంగా స్నేహితులు త్యాగానికి సిద్ధం కావటం చూస్తే.. ఇది కదా స్నేహమంటే అన్న భావన కలుగక మానదు. పంచాయితీ ఎన్నికల బరిలో ఫ్రెండ్ నిలిచిన వేళ.. అతడికి పూచీకత్తుగా అతడి స్నేహితులు నిలవటం.. ఓటర్లకు వ్యక్తిగతంగా హామీ ఇవ్వటం ఆకట్టుకుంటోంది. అసలేం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లి పంచాయితీలో సర్పంచ్ అభ్యర్థిగా ఆసంపల్లి రాజయ్య బరిలో నిలిచారు. ఎన్నికల వేళ.. ఓటర్లకు అభ్యర్థిగా తాను విజయం సాధిస్తే తానేం చేస్తానన్న హామీలు ఇవ్వటం మామూలే. ఈ ఉదంతంలో ఆసక్తికర కోణం ఏమంటే.. అభ్యర్థి స్నేహితులు వ్యక్తిగతంగా పూచీ ఇవ్వటం. రాజయ్య స్నేహితులు హైదరాబాద్ లో వ్యాపారం చేస్తుంటారు.
ఎన్నికల్లో రాజయ్య విజయం సాధిస్తే పేదింటి ఆడపిల్ల పెళ్లిళ్లకు రూ.10,116, కాన్పు ఖర్చు కింద రూ.5,116, అత్యవసర వైద్య చికిత్సలకు రూ.5-10వేలు.. ఇంటర్ లో మంచి మార్కులు సాధించే విద్యార్థులకు రూ.5,116 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే.. రాజయ్య స్నేహితులు భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులైన దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు అండగా నిలిచి.. తమ స్నేహితుడు ఎన్నికల్లో గెలిస్తే.. హామీలిచ్చిన వాటిని అమలయ్యే బాధ్యతను తాము తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎన్నికల్లో అభ్యర్థి హామీలు ఇవ్వటం చూసి ఉంటాం కానీ ఇలాంటివి ఇప్పటివరకు విన్నది లేదు. స్నేహితుడు బరిలో ఉంటే..ఎన్నికల హామీల్ని నెరవేర్చే బాధ్యతను స్నేహితులు తీసుకోవటం హైలెట్ అంశంగా చెప్పాలి. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే స్నేహం అంటే ఇదిరా అన్న భావన కలుగక మానదు.