ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ: కొన్నది సిమ్లా కాదా? హైదరాబాద్ లోనా?

జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.;

Update: 2026-03-19 04:04 GMT

జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందన్న విషయాన్ని ఈగిల్ టీం గుర్తించింది. ఆధారాల్ని సేకరించింది. పార్టీలో పాల్గొన్న వారంతా డ్రగ్స్ వినియోగించిన దాఖలాలు వారికి నిర్వహించిన పరీక్షలతో వెల్లడైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పార్టీలో వినియోగించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? అన్న ప్రశ్నకు.. తొలుత సిమ్లా అన్న సమాధానం వచ్చింది. అయితే.. ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు సంధిస్తున్న ప్రశ్నల పరంపరకు కొత్త సందేహాలకు తావిచ్చేలా సమాధానాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారన్న దానిపై బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి చెప్పిన వివరాలు మొత్తం కట్టుకథగా పోలీసులు గుర్తించారు. దీనికి కారణం..పార్టీలో వినియోగించిన డ్రగ్స్ ను సిమ్లాలో కొన్నట్లుగా చెప్పిన న్యాయవాది మాటలకు భిన్నంగా రోహిత్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కం డ్రైవర్ వెల్లడించిన వివరాలు వేరుగా ఉండటమే దీనికి కారణం. రోహిత్ రెడ్డి సూచన మేరకు తాను ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరకు వెళ్లి అభిషేక్ సింగ్ అనే వ్యక్తి నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్లుగా చెప్పటమే దీనికి కారణం.

ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డికి డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ వెల్లడించిన వివరాల ప్రకారం అభిషేక్ సింగ్ హైదరాబాద్ కు చెందిన డ్రగ్స్ ఫ్లెడ్లర్ గా భావిస్తున్నారు. అతను అందుబాటులోకి రానప్పటికి.. అతడికి సన్నిహితంగా ఉండే వ్యక్తి ద్వారా వివరాల్ని రాబడుతున్నారు. ఇతడ్ని అదుపులోకి తీసుకుంటే ఈ కేసు మరో మలుపు తిరుగుతుందని చెబుత్నారు.

ఇదిలా ఉండగా పార్టీలో పట్టుబడిన వారిలో అభిషేక్ ను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ప్రచారం జరిగినప్పటికి.. వాస్తవంలో అదేమీ కాదని చెబుతున్నారు. ఇతడికి సంబంధించిన వివరాల విషయంలోనూ అసలు విషయాలు వేరుగా ఉన్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పోలీసుల విచారణ వేళ కౌశిక్ రవి తీరు కాస్త ఇబ్బందిగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా పోలీసులు ఈ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News