అరంగేట్రమే చేయలేదు.. రూ.కోట్లు పలికారు
ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఇందులో అన్ క్యాప్డ్ భారత కుర్రాళ్ల హవా ఒక రేంజ్ లో సాగింది. అరంగేట్రమే కాలేదు కానీ అప్పుడే ఆ ఊరు,పేరు తెలియని కుర్రాళ్ల మీద రూ.కోట్ల వర్షం కురిసింది.;
ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఇందులో అన్ క్యాప్డ్ భారత కుర్రాళ్ల హవా ఒక రేంజ్ లో సాగింది. అరంగేట్రమే కాలేదు కానీ అప్పుడే ఆ ఊరు,పేరు తెలియని కుర్రాళ్ల మీద రూ.కోట్ల వర్షం కురిసింది. దెబ్బకు కోటీశ్వరులైన వైనం తాజా మినీ వేలంలో చోటు చేసుకుంది. అరంగేట్రం కాని ఈ కుర్ర క్రికెటర్లను సొంతం చేసుకోవటానికి ఫ్రాంఛైజీలు పోటీ పడి మరి భారీ మొత్తాల్ని వెచ్చింది సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది మాత్రం ఉత్తరప్రదేశ్ కు చెందిన 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్. మరొకరు 19 ఏళ్ల రాజస్థాన్ కు చెందిన వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన కార్తీక్ శర్మలుగా చెప్పాలి.
వీరి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడి పెట్టిన ధరలు క్రికెట్ వర్గాలు సైతం విస్మయానికి గురయ్యేలా చేశాయి. ఈ ఇద్దరిని సొంతం చేసుకోవటానికి చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.14.20 కోట్ల చొప్పున ఒక్కొక్కరి మీద ఖర్చు చేసి సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అరంగేట్రం చేయిన ఆటగాళ్లుగా ఈ ఇద్దరు చరిత్రను క్రియేట్ చేశారని చెప్పాలి.
వాస్తవానికి బిడ్డింగ్ వేళకు ఈ ఇద్దరు ఆటగాళ్ల బేస్ ధర రూ.30 లక్షలు మాత్రమే. వేలంలో కోట్లు కుమ్మరించి మరీ సొంతం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ పేసర్ అకిబ్ నబి దర్ సైతం రూ.8.40 కోట్లు పలికాడు. ఇతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఆల్ రౌండర్ మంగేశ్ యాదవ్ కోసం ఆర్సీబీ రూ.5.20 కోట్లు ఖర్చు చేసింది.
ఇక.. బ్యాటర్ తేజస్వి దహియాకు రూ.3 కోట్లు, బ్యాటర్ ముకుల్ చౌదరికి రూ.2.60 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లను చూస్తే.. హైదరాబాద్ బ్యాటర్ అమన్ రావును రాజస్థాన్ రూ.30 లక్షలకు సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బౌలర్ ప్రథ్వీరాజ్ ను గుజరాత్ సొంతం చేసుకుంది. ఇతడి ధర రూ.30 లక్షలు పలికింది. మొత్తంగా 77ఖాళీలు ఉంటే 359 మంది ఆటగాళ్లను వేలం వేయటం తెలిసిందే.