బాలయ్య బాటలో సోనూసూద్.. 500 మందికి పైగా

తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ అందులో సోనూసూద్ ఇలా చెప్పుకొచ్చారు.." 500 మందికి పైగా శస్త్ర చికిత్సలు జరిగాయి.. ముఖ్యంగా ఈ మహమ్మారి నుండి 500 మంది మహిళలను కాపాడగలిగాము.;

Update: 2025-12-17 08:25 GMT

రియల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు సోనూసూద్.. ఒకవైపు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. మరొకవైపు తన గొప్ప మనసుతో కర్ణుడిగా పేరు దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా సమయం నుండే ఎంతో మందికి అండగా నిలిచిన ఈయన.. ఆ సమయంలో ఆస్తులను అమ్మి మరీ అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లతో పాటు వ్యవసాయ పనిముట్లు, ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులను పంపిణీ చేసి మంచి మనసున్న వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు వలస కార్మికులు తమ గమ్యస్థానానికి చేరడంలో సహాయపడిన ఈయన నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు.

ఇక ఆయన సేవాగుణం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పటికీ కొనసాగుతూ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా బాలయ్య బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతేకాదు తన తల్లి పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎంతోమందికి ఉచితంగా వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఈయన బాటలోనే మరో హీరో సోనూ సూద్ కూడా నడుస్తున్నారు. ఏకంగా 500 మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించి మంచి మనసు చాటుకున్నారు .

తన ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న 500 మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయించినట్లు తెలిపారు.. ఇప్పటికే దేశంలోని మహిళలకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడంపై మరింత దృష్టి సారించినట్లు కూడా సోనూసూద్ తెలిపారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ అందులో సోనూసూద్ ఇలా చెప్పుకొచ్చారు.." 500 మందికి పైగా శస్త్ర చికిత్సలు జరిగాయి.. ముఖ్యంగా ఈ మహమ్మారి నుండి 500 మంది మహిళలను కాపాడగలిగాము.

వారంతా మళ్లీ బ్రతికారు.. వారి కుటుంబాలలో ఆనందం నింపినందుకు నాకు మరింత సంతోషంగా ఉంది. ముఖ్యంగా సమిష్టి కృషి వల్లే ఇలాంటి గొప్ప పనులు సాధ్యమవుతాయి" అంటూ తెలిపారు.. ఇకపోతే ఇది ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తానని స్పష్టం చేశారు. ఏది ఏమైనా సోనూ సూద్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు అనడంలో సందేహం లేదు.. ఏది ఏమైనా భగవంతుడు రూపంలో సోనూ సూద్ ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపారు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సోనుసూద్ విషయానికి వస్తే.. 1999లో తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తర్వాత హిందీ చిత్రాలలో నటించారు. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించగా.. అనుష్క శెట్టి అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు దక్కించుకున్నారు. ఈ చిత్రంతో ఉత్తమ విలన్ గా నంది పురస్కారం కూడా లభించింది. అలాగే ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఫిలింఫేర్ అవార్డు లభించింది. అలా తెలుగు , తమిళ్ , హిందీ చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఒకవైపు తన చిత్రాలతో ఉత్తమ నటుడిగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా మరొకవైపు సమాజసేవ చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పాపులారిటీ అందుకుంటున్నారు.

Tags:    

Similar News