లవ్ లీవ్ అడిగిన కుర్ర ఉద్యోగి.. కాదనే ధైర్యం లేదన్న మేనేజర్
అవసరాలు తీర్చుకోవటం కోసం అబద్ధాలు చెప్పే కన్నా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తే. నిజాయితీగా ఉంటేనే మంచిది. పని చేసే ప్రదేశంలో నిజాయితీతో వ్యవహరిస్తే ఆ మర్యాద.. గౌరవమే వేరుగా ఉంటుంది.;
అవసరాలు తీర్చుకోవటం కోసం అబద్ధాలు చెప్పే కన్నా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తే. నిజాయితీగా ఉంటేనే మంచిది. పని చేసే ప్రదేశంలో నిజాయితీతో వ్యవహరిస్తే ఆ మర్యాద.. గౌరవమే వేరుగా ఉంటుంది. తాజాగా ఒక ఐటీ ఉద్యోగి తన బాస్ కు పంపిన ఈ మొయిల్.. అందులో ఉన్న విషయం.. దానికి సదరు బాస్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు..ఆసక్తికర చర్చకు తెర తీసింది. సదరు బాస్ వీరెన ఖుల్లర్ తనకు వచ్చిన ఈ-మొయిల్ ను లింక్డిన్ లో షేర్ చేయటంతో అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో నిజాయితీగా వ్యవహరించిన ఉద్యోగి ధైర్యానికి ఫిదా అయితే.. సదరు బాస్ నిర్ణయానికి ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంతకూ మ్యాటరేంటి? అంటారా? అక్కడికే వస్తున్నాం. సాధారణంగా లీవ్ కావాలంటే సవాలచ్చ కారణాలు.. చూసినంతనే కాదనలేని విధంగా ఉండే కారణాల్ని చెప్పటం తెలిసిందే. అందుకు భిన్నంగా ఒక కుర్ర ఐటీ ఉద్యోగి మాత్రం సూటిగా.. సుత్తి లేకుండా ఉన్న విషయాన్ని చెప్పేశాడు. తన లవ్వర్ ఊరికి వెళుతుందని.. ఇప్పుడు వెళితే ఎప్పుడో కానీ రాదని.. అందుకే ఆమెతో గడిపేందుకు ఒక రోజు లీవ్ కావాలని కోరాడు.
డిసెంబరు 17న తన గాళ్ ఫ్రెండ్ ఊరికి వెళుతున్న నేపథ్యంలో తనకు ఒక రోజు సెలవు ఇస్తే.. తాను ఆమెతో సమయాన్ని గడుపుతానని బాస్ కు ఒక టెకీ ఈమొయిల్ చేశాడు.లంచ్ అవర్ లో వచ్చిన ఈ మొయిల్ ను ఆ బాస్.. ఆ తర్వాత చూసి కాస్తంత సర్ ప్రైజ్ అయ్యాడు. సాధారణంగా ఇంట్లో వారికి ఆరోగ్యం బాగోలేదని.. లేదంటే తన ఆరోగ్యం సరిగా లేదని సాకులు చెప్పేస్తారని.. అందుకు భిన్నంగా నిజాయితీగా తనకు లవ్ లీవ్ కావాలని అడిగిన ఆ కుర్ర ఉద్యోగికి అతడి బాస్ నిండు మనసుతో ఓకే చెప్పేశాడు.
తన టీం మెంబర్ తనకు పంపిన ఈ-మొయిల్ ను వీరెన్ ఖుల్లర్ లింక్డిన్ లో పోస్టు చేసి.. తాను మొయిల్ చదివిన క్షణంలో తానో బాస్ కాకుండా ఒక మనిషిని మాత్రమేనన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారని చెప్పాలి. మనిషి జీవితంలో ప్రేమకు ఉండే ప్రాధాన్యతను ఆయన గౌరవించాడు. సెలవు మంజూరు చేస్తూ.. ఆ లవ్ లీవ్ లెటర్ ను స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా సదరు బాస్ చేసిన వ్యాఖ్యే ఈ ఎపిసోడ్ లో హైలెట్ అంశంగా చెప్పాలి. ‘ప్రేమకు నో చెప్పే ధైర్యం మనకు ఎక్కడిది? సెలవు ఓకే చేశాను. నువ్వు హ్యాపీగా వెళ్లు’’ అంటూ ముగించారు. ఈ పోస్టు పెద్ద ఎత్తున వైరల్ కావటమే కాదు.. ‘అసలైన వర్కు - లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇదే’ అని ఒకరు.. ఆ మేనేజర్ కు సలామ్ అని మరొకరు.. సెలవు ప్రేమ పేరుతో దొరకటమంటే లక్ అని ఇంకొందరు స్పందించారు. ఏమైనా.. ఈ లవ్ లీవ్ లెటర్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోందని మాత్రం చెప్పాలి.