జనసేన డీఎన్ఏ మారిపోయిందా ?
జనసేన ఆలోచనలు ఏమిటి ఆ పార్టీ పెట్టినపుడు సిద్ధాంతాలు ఏమిటి భావజాలం ఏమిటి జరుగుతున్నది ఏమిటి అన్న చర్చ ఇపుడు జరుగుతోంది.;
జనసేన ఆలోచనలు ఏమిటి ఆ పార్టీ పెట్టినపుడు సిద్ధాంతాలు ఏమిటి భావజాలం ఏమిటి జరుగుతున్నది ఏమిటి అన్న చర్చ ఇపుడు జరుగుతోంది. ఎక్కడా జరగడం లేదు, జనసేన లోనే, సొంత పార్టీ వారే ఈ విధంగా చర్చించుకుంటున్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత తన గళాన్ని గతాన్ని మరచిపోయిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన కొత్త పార్టీ, సరికొత్త భావజాలం కలిగిన పార్టీ అని చెప్పుకున్నారు. కానీ ఇపుడు కూటమిలో ఉండడం వల్ల అన్నీ మరచి సర్దుకుని పోవాలని అంటే మేము అలా ఉండలేమని నేతలు అంటున్నారు. ఒక్కొక్కరుగా నేతలు అయితే తన మనసులోని మాటలను బయట పెడుతున్నారు. జనసేనలో ఇంతకీ అసలు ఏమి జరుగుతోంది అన్నది అతి పెద్ద చర్చగా ఉందిపుడు.
పార్టీకి దూరంగా :
ఒకే రోజు రెండు సంఘటలను ఇద్దరు కీలక నేతలు జనసేకు దూరంగా జరిగారు. ఒకరు అయితే బొలిశెట్టి సత్యనారాయణ. తాను పార్టీకి కొంత కాలం దూరంగా ఉండదలచుకున్నాను అని ఆయన చెప్పారు. కారణం పర్యావరణ సమస్యల మీద ఉద్యమం చేయడం కోసం అని ఆయన స్పష్టం చేశారు. ఆయన అలా పార్టీకి దూరం జరిగినా కారణాలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. పార్టీ వైఖరి మీద ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు అన్న చర్చ నడుస్తోంది. ఇక ఒక మహిళా న్యాయవాదిగా వీర మహిళగా జనసేన ఆవిర్భావం నుంచి ఉంటూ వచ్చిన నక్కా రజనీ జనసేనకు దూరం అయ్యారు. ఆమె అయితే ఏకంగా పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తమ సిద్ధాంతాలను వదులుకోవాలని లేదు కదా అని అంటున్నారు.
దాడులను సమర్ధిస్తుందా :
జనసేన అధినేత పవన్ మొదటి నుంచి ఒక్కటే అంటూ వచ్చారు దాడులను మేము సమర్ధించమని, అంతే కాదు ప్రతీకార రాజకీయాలకు మేము వ్యతిరేకమని. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి మీద ఇప్పటిదాకా జనసేన నుంచి అయితే సరైన స్పందన రాలేదు, అఫ్ కోర్స్ అంబటి రాంబాబు చేసిన అనుచిత విమర్శలను ఎవరూ సమర్థించడం లేదు, కానీ ఆయనను శిక్షించడానికి ఒక విధానం ఉంది, చట్టం ఉంది. లా ఉంది దాని ప్రకారం అంతా జరగాలి. కానీ ఇంటి మీద దాడులు చేయడం అంటే దానిని జనసేన ఎలా చూస్తోంది అన్నది అయితే ఆ పార్టీలో చాలా మందికి అర్ధం కావడం లేదు అని అంటున్నారు.
కుండ బద్ధలు కొట్టారు :
ఇక జనసేనకు దూరం జరిగిన న్యాయవాది నక్కా రజనీ అయితే కుండ బద్ధలు కొట్టారు. కూటమిలో ఉన్నంత మాత్రాన ప్రతీ విషయాన్ని సమర్ధించాలా అని ఆమె ప్రశ్నించారు. ఒక వెబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మనం మరణించినా సిద్ధాంతాలు చావకూడదని అన్నారు. కానీ రాజీ పడడం అన్నది మంచిది కాదని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం అమరావతిలో పెట్టడం మంచిదే కానీ అది 1700 కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చింది ప్రజల పన్నుల నుంచి ఖర్చు పెట్టి నిర్మించాలా అని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబీకులు ధనవంతులే కదా వారు నిర్మించుకోలేరా అని ఆమె అన్నారు. అలాగే ఎన్నో అంశాల మీద జనసేన నేతలలో అంతర్మధనం జరుగుతోంది అని అన్నారు.
కొట్టే సంప్రదాయం ఏంటి :
రాజకీయ ప్రత్యర్థుల ఇంటి మీద దాడి చేయడమేంటి అని ఆమె ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేయాలి అనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని అన్నారు. ఆ నేతల పార్టీ ఆఫీసుల వద్ద ధర్నా చేయవచ్చు మీడియా ద్వారా తన భావాలని చెప్పవచ్చు అని రజనీ అన్నారు. అంతే తప్ప ఈ దాడులు ఏమిటి అని ఆమె నిలదీశారు. లాకౌట్ చేసిన కర్మాగారం వద్ద కార్మికులు ధర్నాలు చేస్తారు తప్ప దానిని తగలబెట్టరని అన్నారు. చదువు లేని వారికి ఉన్న అవగాహన కూడా మనకు లేదా అని ఆమె అన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసు మీద దాడి జరిగితే మనమే ఖండించామని తిరిగి ఆ పని ఎలా చేస్తారని ఆమె కూటమి నేతలను ప్రశ్నించారు.
కూటమికి ఇబ్బంది ఉండరాదు :
తాను ఈ రోజు నుంచి జనసేన అభిమానిగా ఉంటాను అని ఆమె అన్నారు. అధికార ప్రతినిధిగా ఉండకూడదని భావించి తాను తప్పుకుంటున్నాను అని రజనీ చెప్పడం విశేషం. ఇదే విధంగా చాలా మంది నేతలు జనసేనలో నలుగుతున్నారని అంటున్నారు. పార్టీలో ఉంటే వ్యతిరేకంగా మాట్లాడలేరని, అందుకే తమ భావాలను నిర్భయంగా చెప్పడానికే ఇదే దారిగా ఎంచుకున్నారని అంటున్నారు. పైగా తాము జనసేన లక్ష్యాలను అనుసరిస్తామని చెబుతున్నారు. అంటే కూటమిలో చేరాక జనసేన తన లక్ష్యాలను మరచిందా లేదా జనసేన డీఎన్ఏ మారిందా అన్న కొత్త చర్చ వస్తోంది.