మమతా దీదీ సోలోగానే - వ్యూహాత్మకంగానే
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కొత్త రూపు తీసుకోనున్నాయి. ఈ ఏడాది మధ్యలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.;
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కొత్త రూపు తీసుకోనున్నాయి. ఈ ఏడాది మధ్యలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని మమతా బెనర్జీ ఉత్సాహపడుతున్నారు. దానికి తగినట్లుగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కీలకమైన ప్రకటన చేశారు. ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తన బలం ఏంటో జనంతోనే కలసి తేల్చుకుంటామని ఆమె బిగ్ సౌండ్ చేశారు.
గతసారి పొత్తులు :
ఇదిలా ఉంటే గతసారి తృణమూల్ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంది గూర్ఖా జనముక్తి మోర్చా రెండు వర్గాలు అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ డార్జిలింగ్‌లో మూడు స్థానాలను గూర్ఖా జనముక్తి మోర్చాకి కేటాయించింది. ఇక ఆర్జేడీ, శివసేన, జేఎంఎం కూడా తృణమూల్‌కు మద్దతు ఇచ్చాయి. ఈ విధంగా పొత్తులతో వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్ అంచనాలకు మించి ఏకంగా 215 కి మించి సీట్లను సాధించింది. అయితే ఈసారి ఎవరితోనూ పొత్తులు లేవని తేల్చేశారు మమతా దీదీ. అన్ని సీట్లకు తామే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. కాస్తా వెనక్కి వెళ్తే 2011లో కాంగ్రెస్ తో తృణమూల్ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంది. 2011 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. అప్పటికి 34 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఓడించి, 294 స్థానాలున్న శాసనసభలో 227 స్థానాలను గెలుచుకుని మమతా బెనర్జీ సీఎం అయ్యారు. ఇక ఆ ఎన్నికల్లో టీఎంసి ఒక్కటే 184 స్థానాలను గెలుచుకోవడంతో ఏ కూటమి సహాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
కాంగ్రెస్ తో నో :
అయితే గత రెండు తడవలుగా కాంగ్రెస్ కి దూరంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియా నుంచి వచ్చిన ప్రశ్నలకు ఆమె నో అంటూ తోసిపుచ్చడంవిశేషం. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్‌లో ఒంటరిగా పోరాడుతుందని చెప్పారు. అన్ని పార్టీలు తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయని ఆమె అంటూ వారిని అలాగే పోరాడనివ్వండని అన్నారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత ఆలోచనలు ఉంటాయని అన్నారు.
ప్రతీ సీటు ఇంపార్టెంట్ :
బెంగాల్ లోని 294 సీట్లూ తమకు చాలా ఇంపార్టెంట్ అని మమతా బెనర్జీ చెప్పడం విశేషం.ఈసారి టీఎంసీ మరిన్ని సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని చెప్పదానికి తాను ఏమీ రాజకీయ జ్యోతిష్కురాలిని కాదని ఆమె అంటూ . కానీ ఈసారి తమ పార్టీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పడం విశేషం.
వ్యూహం చెప్పను అంటూ :
ఇదిలా ఉంటే సర్ ప్రక్రియ తర్వాత బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ వ్యూహం గురించి తాను ఇపుడే చెప్పను అమి మమత పేర్కొనడం విశేషం. ఏ విషయం అయినా వ్యూహం అయినా పార్టీతో దాని గురించి చర్చిస్తామని అన్నారు తమ పార్టీకి చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, బ్లాక్ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు ఉన్నారని ఆమె చెప్పారు అందువల్ల తాను ఒంటరిగా ఏ నిర్ణయం తీసుకోనని అన్నారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అని స్పష్టం చేశారు.
బహుముఖ పోటీలు :
ఇదిలా ఉంటే ఎన్నికలు కొద్ది నెలలు ఉన్నాయనగా బెంగాల్ రాజకీయం నెమ్మదిగా ఒక రూపునకు వస్తోంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని ఈసారి చూస్తోంది. అలాగే కమ్యూనిస్టులు ఒంటరిగానే బరిలోకి దిగుతారు. బీజేపీ ఎటూ సొంతంగా పోటీ చేస్తుంది. ఇలా విపక్షాలు అన్నీ తృణమూల్ కాంగ్రెస్ కి యాంటీగా రంగంలో ఉంటాయి. దాంతో యాంటీ ఇంకెంబెన్సీ కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ కానీ పూర్తిగా చీలిపోతుందని తద్వారా మరోసారి అధికారం తమ సొంతం అవుతుందని మమతా బెనర్జీ వ్యూహ రచన చేస్తున్నారు అని అంటున్నారు.