కూటమి అంటారా? కుమ్మక్కు అందామా?.. ఏబీవీ తీవ్ర విమర్శలు

కడప జిల్లాలోని మంగంపేట బైరటీస్ గనుల లీజు విషయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త నల్లమోతు చక్రవర్తి తన సొంత యూట్యూబ్ చానల్ లో ప్రత్యేక వీడియో చేశారు.

Update: 2026-06-25 03:33 GMT

కూటమి ప్రభుత్వంపై రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) తీవ్ర విమర్శలు చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కడప జిల్లాలోని మంగంపేట బైరటీస్ గనుల లీజుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించడమే కాకుండా, ఈ గనుల లీజుల విషయంలో విపక్షంతో ప్రభుత్వ పెద్దలు రాజీ పడ్డారనే అర్థం వచ్చేలా ఏబీవీ చేసిన ట్వీట్ ఆలోచనలను రేకెత్తిస్తోందని అంటున్నారు. టీడీపీ సానుభూతిపరుడనే అనుమానంతో గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి వేధింపులకు గురైన ఏబీవీ కూటమి ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోందని అంటున్నారు.

కడప జిల్లాలోని మంగంపేట బైరటీస్ గనుల లీజు విషయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త నల్లమోతు చక్రవర్తి తన సొంత యూట్యూబ్ చానల్ లో ప్రత్యేక వీడియో చేశారు. ఈ వీడియోలో ఆయన అనేక సంచలన ఆరోపణలు చేశారు. కడప జిల్లాలో రాజకీయ నాయకులకు మంగంపేట బైరటీస్ గనులు అతిపెద్ద ఆదాయ వనరుగా మారిందని ఆరోపించారు. అంతేకాకుండా, ప్రజల సంపద అయిన ఈ గనిని టీడీపీ కూటమి, వైసీపీ కలిసి ఖతం చేశాయని ధ్వజమెత్తారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బైరటీస్ గని మంగంపేటలో మాత్రమే ఉందని, దీనిని ఖతం చేశారంటూ ఏబీవీ ఆరోపించారు. మంగంపేటలో ఏం జరుగుతుందో చూడండి అంటూ నల్లమోతు చక్రవర్తి వీడియోను ఏబీవీ షేర్ చేశారు. కూటమి అంటారా? కుమ్మక్కు అంటామా? అంటూ ప్రశ్నించారు. దీంతో ఏబీవీ ట్వీట్ పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రపంచంలో అతిపెద్ద గని మంగంపేటలో ఉందని, దేశంలో బైరటీస్ నిల్వల్లో దాదాపు 95 శాతం ఇక్కడే ఉన్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఈ గని నుంచి బైరటీస్ తవ్వకాల్లో రూ.20 వేల కోట్లు అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోపించిందని, కానీ ఇప్పటికీ చర్యలు లేకపోగా, స్థానికంగా ఉన్న చిన్న కాంట్రాక్టర్లను మోసం చేశారని నల్లమోతు చక్రవర్తి తన వీడియోలో ఆరోపించారు.

ఏబీవీ, నల్లమోతు కలిసి ఆలోచనా పరుల వేదిక అనే సంస్థ ద్వారా కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు. పోలవరం నిర్మాణాలపై సూచనలు ఇవ్వడమే కాకుండా, పనుల్లో లోపాలను ఎండగడుతూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన బనకచర్లపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడే రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడేలా తాను పనిచేస్తానని ఏబీవీ ప్రకటించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ విధానాలలో తప్పులను ఎత్తిచూపుతూ ఏబీవీ చేస్తున్న పోరాటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీంతో ఆయన తాజాగా చేసిన ట్వీట్ ను ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News