లడ్డూ వివాదం: సేఫ్ రూట్‌లో బీజేపీ ..!
తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించిన కేసు పలు మలుపులు తిరుగుతోంది.;
తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించిన కేసు పలు మలుపులు తిరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద దుమారానికి కూడా దారి తీసింది. ఈ మొత్తం వ్యవహారంలో మెజారిటీ పార్ట్ టీడీపీ వర్సెస్ వైసీపీ ల మధ్యే సాగుతుండగా.. ఇతర కూటమి పార్టీలైన జనసేన, బీజేపీల వ్యవహారం చర్చకు వస్తోంది. ఈ విషయంలో తమ దూకుడు తగ్గిందని భావించిన పవన్ కల్యాణ్.. తన పార్టీ వారికి తాజాగా క్లాస్ ఇచ్చారు.
అందరూ కలసి కట్టుగా కూటమి ప్రభుత్వం తరఫున మాట్లాడాలని ఆయన జనసేన నాయకులకు సూచించారు. అంతా తానే మాట్లాడ లేనని అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు మౌన వ్రతంలో ఉన్న జనసేన నాయకులు.. ఇప్పుడు నెమ్మదిగా అయినా.. నోరు పెకలించే ప్రయత్నం చేస్తారని ఆశించవచ్చు.టీడీపీకి అనుకూలంగా.. వైసీపీపై నిప్పులు చెరుగుతారని కూడా అంచనా వేసుకోవచ్చు. కానీ, ఎటొచ్చీ.. ఆది నుంచి కూటమిలో ఉన్నామని చెబుతున్న బీజేపీ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించ లేదు.
కూటమి ప్రభుత్వంలో పదవులు తీసుకున్నా.. పార్టీ పరంగా బీజేపీ వ్యూహాలు వేరేగా ఉంటున్నాయి. పురం దేశ్వరి వంటి సీనియర్ నాయకురాలు కూడా.. చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల పై స్పందించారు తప్ప.. లడ్డూ వ్యవహారం.. సిట్ ఇచ్చిన నివేదికలపై పన్నెత్తు మాట అనేలేదు. దీంతో ఈ విషయంలో తమకు సంబంధం ఉందని కానీ.. లేదని కానీ.. ఎక్కడా చెప్పలేదు. గతంలో సూపర్ సిక్స్ మేనిఫెస్టో విషయంలో కూడా బీజేపీ నాయకులు ఇలానే వ్యవహరించారన్న చర్చ ఉంది.
ఇక, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 1 న నిర్వహిస్తున్న పేదల సేవలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనూ.. బీజేపీ నాయకులు కనిపించడం లేదు. కొంత మేరకు జనసేన నాయకులు కనిపిస్తున్నారు. ఇక, ఇప్పుడు రాష్ట్రాన్ని రగిలిస్తున్న లడ్డూ వ్యవహారంలో కూడా కమల నాథులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ.. మోడీ చెప్పిన తర్వాత.. కూడా వైసీపీపై నోరు చేసుకునేందుకు సాహసించడం లేదు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి. కేవలం అధికారం పంచుకుంటారో.. లేక ఏం చేస్తారో చూడాలి.