అమెరికా నిర్ణయాలు.. తీవ్ర అనిశ్చితిలో హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు

ఇటీవల ఇంటర్వ్యూల్లో అధికారులు మీ సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ లో ఉన్నాయా? ఏ ఏ ఫ్లాట్ ఫార్మ్ లు వాడుతున్నారు.? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.;

Update: 2025-12-17 07:25 GMT

అమెరికాలో పనిచేయాలనుకునే నైపుణ్యవంతులైన విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా కీలకమైనది. అయితే తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ తీసుకున్న నిర్ణయాలతో హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు తీవ్ర అనిశ్చితిలో చిక్కుకున్నారు. సోషల్ మీడియా స్క్రీనింగ్ ను విస్తరించడంతో 221(జీ) స్లిప్ లు భారీగా పెరుగుతున్నాయి.

సోషల్ మీడియా పరిశీలన ఎందుకు?

2025 డిసెంబర్ 15 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు మాత్రమే కాకుండా వారి డిపెండెండ్స్ (హెచ్4 వీసా) సోషల్ మీడియా ఖాతాలను కూడా అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది సాధారణ వీసా ప్రాసెసింగ్ లో భాగంగా అమలులోకి తీసుకువచ్చారు. లింక్డ్ ఇన్, ఫేస్ బుక్స్, ఎక్స్ వంటి సాధారణ ఫ్లాట్ ఫారాలపై అభ్యర్థుల ఆన్ లైన్ ఉనికిని అధికారులు గమనిస్తున్నారు.

221(జీ) స్లిప్ అంటే ఏమిటి?

వీసా ఇంటర్వ్యూలో వెంటనే అంగీకారం లేదా తిరస్కారం ఇవ్వకుండా మరింత పరిశీలన అవసరమని భావిస్తే అధికారులు 221(జీ) స్లిప్ ఇస్తారు. ఇది వీసా తిరస్కరణ కాదు. కానీ ‘అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్’ పేరుతో అదనపు సమయం తీసుకుంటారు.

ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్నలు

ఇటీవల ఇంటర్వ్యూల్లో అధికారులు మీ సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ లో ఉన్నాయా? ఏ ఏ ఫ్లాట్ ఫార్మ్ లు వాడుతున్నారు.? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. కొందరి వీసా స్టేటస్ అదే రోజు ‘అప్రూవ్డ్’గా మారుతుండగా మరికొందరు రోజులు.. వారాల పాటు ఎదురుచూస్తున్నారు.

పాస్ పోర్ట్ ఉంచుకుంటే పాజిటివ్ సంకేతమా?

అభ్యర్థుల అనుభవాల ప్రకారం.. కాన్సులేట్ పాస్ పోర్ట్ ను తమ వద్దే ఉంచుకుంటే త్వరగా అప్రూవల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చేస్తే ప్రాసెసింగ్ కు 2 నుంచి 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

భారతదేశంలో ప్రభావం ఎక్కువ..

భారతదేశంలోని అమెరికా కాన్సులేట్ లలో ఈ కొత్త వెట్టింగ్ కారణంగా ఆలస్యాలు ఎక్కువయ్యాయి. డిసెంబర్ మధ్యలో షెడ్యూల్ అయిన కొన్ని ఇంటర్వ్యూలు 2026 ప్రారంభానికి వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకున్న ప్రొఫెషనల్స్ కు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది..

న్యాయవాదుల సూచనలు

ఇమిగ్రేషన్ లాయర్లు ఒక ముఖ్యమైన సలహా ఇస్తున్నారు. వీసా దరఖాస్తులో ఇచ్చిన వివరాలకు మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ సరిపోలేలా ఉండాలి. ఉద్యోగ వివరాలు, విద్యార్హతలు ప్రొఫెషనల్ విరుద్దతలు ఉంటే అదనపు అనుమానాలకు దారితీసే అవకాశముంది.

హెచ్1బీ వీసా ప్రక్రియ రోజురోజుకూ కఠినంగా మారుతోంది. సోషల్ మీడియా స్క్రీనింగ్ తో 221 (జీ) స్లిప్ లు పెరగడం వల్ల వేలాది మంది నైపుణ్యవంతులైన ఉద్యోగులు అనిశ్చితిలో ఉన్నారు. అయినప్పటికీ సరైన డాక్యుమెంటేషన్ , స్పష్టమైన ఆన్ లైన్ ప్రొఫైల్ ఉంటే ఈ ఆలస్యాలను తగ్గించుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News