అభిమానులకు పవన్ లెక్చర్.. నవ్వుల పాలవుతోంది!

Update: 2019-12-09 06:49 GMT
జనసేన పార్టీ గురించి చెప్పమంటే.. సామాన్యులు కూడా చేసే విశ్లేషణ ఏమిటంటే, పవన్ కల్యాణ్ కు సినిమాల ద్వారా తోడయిన కొంతమంది అభిమానుల వల్ల మాత్రమే ఆ పార్టీ నడుస్తోంది అనేది. ఆఖరికి పవన్ కల్యాణ్ తనకు ఖాయంగా పడతాయని అనుకున్న కాపుల ఓట్లు కూడా ఆయనకు పడలేదని, కులాలకు అతీతంగా కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు వేసిన ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పడ్డాయనే విశ్లేషణలున్నాయి. అందుకే ఆ పార్టీకి కనీసం ఆరు శాతం ఓట్లు అయినా లభించాయనే అభిప్రాయాలున్నాయి.

మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆ అభిమానుల మీదే ఫైర్ అయిపోయారు. వారికి క్రమ శిక్షణ లేదని - వారికి క్రమ శిక్షణ లేకపోవడం వల్లనే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిందని పవన్ కల్యాణ్  బహిరంగ వ్యాఖ్యానమే చేశారు. అభిమానుల ఎదురుగానే వారికి క్రమశిక్షణ లేదంటూ పవన్ తన అభిమాన లోకాన్నే అవమానించారు!

అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. ఒక సినిమా హీరోని చూడటానికి వచ్చే వాళ్లు అలానే ఉంటారు. వాళ్లు అలానే గోల చేస్తారు. వేరే విషయాలతో సంబంధం లేనట్టుగా వారు ఆరుస్తారు. ఎందుకంటే వారు చూడటానికి వచ్చింది ఒక సినిమా స్టార్ ను.

కాబట్టి.. అలాంటి చోట క్రమశిక్షణ అనేది ఎక్స్ పెక్ట్ చేయకూడదు. అలాంటి ‘క్రమశిక్షణ’ లేని వారు  ఓటేయడం వల్లనే పవన్ కల్యాణ్ కు ఆ మాత్రమైన ఓట్లు వచ్చాయి. వాళ్లు కూడా పవన్ లో ఒక రాజకీయ నేతను చూడకపోతే అంతే సంగతులు!

ఇక రెండో విషయం.. పవన్ కల్యాణ్ తప్పులో తనలో పెట్టుకుని నీతులు ఎదుటి వారికి చెబుతూ ఉంటారు. ఆయన అలా అలవాటు పడిపోయారు. పవన్  మాట్లాడే ప్రతి విషయమూ అలానే ఉంటుంది.

ఒక వేలు వేరే వారి వైపు చూపిస్తూ మూడు వేళ్లు నీ వైపు చూపిస్తూ ఉంటాయనేది సామెత. పవన్ కు అది వంద శాతం వర్తిస్తుంది. ఆయనకు దేని మీద గౌరవం కనిపించదు. ఆఖరికి 151 మంది ఎమ్మెల్యేలు ఎంత? వారి బతుకులెంత? అంటూ ప్రజలు ఎన్నుకున్న వారిని కూడా లెక్క చేయనట్టుగా పవన్ మాట్లాడారు. అలాంటి అహంభావపూర్వకమైన మాటలనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కే ఏమాత్రం క్రమశిక్షణ లేదు ఇలాంటి మాటలను బట్టి. అలాంటిది ఆయన ఫ్యాన్స్ కు హితబోధ చేయడం ప్రహసనం కాదా?
Tags:    

Similar News