ఏపీలో పాక్షిక కర్ఫ్యూ .. సీఎం జగన్ కీలక నిర్ణయం !

Update: 2021-05-03 09:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా జోరు పెరిగిపోతుండటంతో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి నుంచి అమల్లోకి వచ్చేలా కర్ఫ్యూ విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు. ఈ సమయంలో ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేస్తారు. అయితే అన్ని రకాల అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. దీనితో  బుధవారం నుంచి 14 రోజుల పాటు ఈ పాక్షిక కర్ఫ్యూ కొనసాగనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను కంట్రోల్ చేయడానికి ఇటీవల కొన్నినిర్ణయాలు తీసుకుంది. నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని పిలుపునిచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఏపీలో కరోనా కేసులు 24 గంటల్లో 20వేలకు పైగా వస్తున్నాయి. ఈ క్రమంలో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి 14 రోజుల పాటు ఈ పాక్షిక కర్ఫ్యూ  కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో ఇటీవల కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య పెరుగుతుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ విషయంలో ఎక్కడిక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ నేపథ్యంలో, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది. ఇక ఇదిలా ఉంటే .. అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించి తీరుతాం అని చెప్తూ వచ్చిన ఇంటర్ పరీక్షలను సైతం ప్రభుత్వం వాయిదా వేసింది. ఇక, మిగతా పరీక్షల పైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News