రాధా వ్యాఖ్య‌లు బూమ‌రాంగేనా ?

Update: 2021-12-27 05:10 GMT
`ఏం సారూ.. నిన్ను చంపే అవ‌స‌రం.. ఎవ‌రికి ఉంటుందో చెప్ప‌రాదూ``.. ``అయ్యా.. రెక్కీ ఎందుకు నిర్వ‌హించారో.. ఎవ‌రు నిర్వ‌హించారో.. నీకైనా తెలుసా?``.. ``సార్.. సంచ‌ల‌నం కావాలంటే.. ఇలాంటి వ్యాఖ్య‌లు అవ‌స‌రమా?``- ఇవి.. కేవ‌లం కొద్ది నిముషాల వ్య‌వ‌ధిలోనే భారీ ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు. ఈ చివ‌రి నుంచి ఆ చివ‌రి వ‌ర‌కు.. రాష్ట్రం న‌లుమూల‌లా.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లే వైర‌ల్ అయ్యాయి. ఇవ‌న్నీ.. ఎవ‌రి గురించో అర్ధ‌మ‌య్యే ఉంటుంది. ఆయ‌నే వంగ‌వీటి రాధా! దివంగత మాస్ నాయ‌కుడు.. పేద‌ల పెన్నిధి రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే రాధా చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందించారు.

"నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు. నన్ను చంపాలని చూసినా భయపడను, దేనికైనా సిద్ధం. నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటా. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే లక్ష్యం`` అని వంగ‌వీటి రాధా కామెంట్లు చేశారు. అయితే.. త‌న‌ను ఎవ‌రు ఎప్పుడు.. ఇలా ప్ర‌య‌త్నించార‌నే విష‌యంపై ఆయ‌న మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. వంగ‌వీటి రంగా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వ‌హించారు. అనంతరం మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి వంగవీటి రాధా మీడియాతో మాట్లాడారు.

తనను చంపేందుకు రెక్కీ నిర్వ‌హించార‌ని వ్యాఖ్యానించారు. అయితే ఎవ‌రు ఇలా చేశార‌న్న దానికి ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదు. త్వరలోనే అన్ని విషయాలు బయటికివస్తాయంటూ బదులిచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా వైర‌ల్ అయ్యాయి. దీంతో రంగా, రాధా అభిమానులు ఆశ్చ‌ర్య పోయినా.. ఈ వ్యాఖ్య‌ల‌పై మాత్రం కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేశారు.

ఎందుకంటే.. రాధాను చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంటుంది? ఆయ‌నేమ‌న్నా.. రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నారా? పోనీ.. ఆయ‌న‌కేమైనా .. వ్యాపారాలు ఉన్నాయా? వ్యాపార వ‌ర్గాల్లో శ‌త్రువులు ఉన్నారా? లేక‌.. భూ వివాదాలు ఉన్నాయా? పైగా..ఆయ‌నేమీ.. సంచ‌ల‌న కామెంట్లు చేసి.. రాజ‌కీయాల‌ను వేడెక్కించ‌డం.. శ‌త్రువుల‌ను పెంచుకోవ‌డం వంటివి చేయ‌డం లేదుక‌దా! అంతేకాదు.. ఆయ‌న ఉన్న‌పార్టీలో కంటే.. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీలోనే మిత్రులు ఎక్కువగా ఉన్నారు. మ‌రి అలాంటి స‌మ‌యంలో ఆయ‌న‌పై రెక్కీ ఎవ‌రు నిర్వ‌హిస్తారు? ఎందుకు చేస్తారు? అనేవి ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

వీటిపైనే నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. అన్నా.. నిన్ను చంపాల్సిన అవ‌స‌రం ఏముంది? రంగా లాగా దూకుడు లేదు. రంగా లాగా ప్ర‌త్య‌ర్థుల‌తో పోరాడే ఓపిక కూడా లేదు. ఎక్క‌డిక‌క్క‌డ రాజీ ప‌డుతుంటావు. నీకు శ‌త్రువులు ఎందుకు ఉంటారు? పైగా కుల సంఘాల్లో కుమ్ములాట‌లు ఏమైనా చేస్తున్నావా ? అంటే.. అది కూడా లేదు. సో.. నీకు నువ్వే.. ఇలా భావిస్తే.. ఎలా అన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో రాధా ఏం ఆశించాడో తెలియ‌దు..కానీ, ఆయ‌న‌కు మాత్రం బూమ‌రాంగ్ అయ్యేలా ప‌రిస్థితి మారిపోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News