టీడీపీ గెలుస్తుందని ప్రజలు అనాలే కానీ మీరు కాదు బాబు

Update: 2021-05-31 17:30 GMT
రాజకీయాల్లో మార్పులు సహజం. అధికారం ఎవరి చేతుల్లోనూ శాశ్వితంగా ఉండదు. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి తాను చేయాలనుకున్నది చేయటం కోసం అంతో ఇంతో అవకాశం ఇవ్వాలి. అందుకు భిన్నంగా ఓడిన క్షణం గురించి.. ఓటమికి కారణాలు ఏమిటన్న విషయం మీద ఫోకస్ పెట్టకుండా.. నిత్యం ఏదో ఒక నిందను మోపుతూ.. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించటం లాంటిది చేయటం వల్ల సాధించేది ఏమిటన్నది చంద్రబాబుకు కూడా తెలీదేమో? తాను అదే పనిగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం ద్వారా.. ప్రజల్లో ఎలాంటి భావన కలిగేలా ఆయన మాటలు ఉంటున్నాయన్న విషయం మీద నిఖార్సైన నివేదికను తెప్పించుకుంటే తప్పించి బాబు తీరులో మార్పు రాదేమో?

రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దారుణమైన రీతిలో విమర్శలకు దిగారు చంద్రబాబు. ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అధినేతలకు ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. ప్రజలు మెచ్చి అధికారాన్ని కట్టబెట్టిన నేపథ్యంలో.. వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ.. ఒకట్రెండు ఏళ్ల పాటు మాట్లాడకుండా ఉండటం కనీస ధర్మం . అందుకు భిన్నంగా జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల నుంచే ఆయన ఏదో ఒక మాట అనటం మొదలు పెట్టారు.

రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నవేళ.. సీఎం జగన్ పై చంద్రబాబు దారుణ రీతిలో వ్యాఖ్యలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రజలకు నచ్చి.. మెచ్చి అధికారాన్ని అప్పజెప్పిన నేపథ్యంలో.. రెండు మూడేళ్లు వేచి చూసే ధోరణితో వ్యవహరించి.. ఆ తర్వాత చేస్తున్న తప్పుల్ని ఎండగడితే బాగుంటుంది. అందుకు భిన్నంగా నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఏదో ఒక విషయంలో రచ్చ చేద్దాం.. ఇమేజ్ డ్యామేజ్ చేద్దామన్న తలంపుతో మొదటిక మోసం వస్తుందన్న విషయాన్ని బాబు గ్రహించటం లేదు. అదే పనిగా విమర్శల్నిప్రజలు స్వాగతించరని.. ప్రభుత్వం తప్పులు చేసే అవకాశం కూడా ఇవ్వని చంద్రబాబు తీరును చూస్తే.. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ గెలుస్తుందన్న మాట బాబు నోటి నుంచి కంటే ఏపీ ప్రజల మనసుల నుంచి వచ్చే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే చికాకు కలిగేలా చేస్తుందన్న సత్యం చంద్రబాబుకు ఎప్పుడు అర్థమవుతుంది?
Tags:    

Similar News