భారత్ వైరస్ చాలా డేంజర్: నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2020-05-20 17:34 GMT
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్ పైన అక్కసు వెళ్లగక్కారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతోందని విమర్శించారు. చైనా, ఇటలీ కంటే భారత్ వైరస్ చాలా ప్రమాదకరమన్నారు. ఇటీవల భారత్ భూభాగాన్ని తమ మ్యాప్‌లో పొందుపరిచింది నేపాల్. ఇప్పుడు కరోనా అంశంపై భారత్‌ పై అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేశారు.

అక్రమ మార్గం ద్వారా భారత్ నుండి వస్తోన్న వారు తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని వ్యాఖ్యానించారు. సరైన కరోనా పరీక్షలు నిర్వహించకుండానే భారత్ నుండి జనాలను తీసుకు వస్తున్నారని, దీనికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆయన పార్లమెంటులో వ్యాఖ్యలు చేశారు.

కైలాస్ మానససరోవర్ మార్గం కోసం లిపులేఖ్ పాస్‌ను అనుసంధానిస్తే రోడ్డు మార్గాన్ని నిర్మించిన భారత్ మే 8వ తేదీన దీనిని ప్రారంభించింది. ఈ మార్గం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా నుండి వెళ్తోంది. ఇది పూర్తిగా భారత భూభాగమని, అందుకే రహదారిని నిర్మించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఈ భూభాగం తమదని నేపాల్ చెబుతోంది.

అదే సమయంలో ఓలి మాట్లాడుతూ.. కాలాపాని-లింపియాధుర-లిపులేఖ్ ప్రాంతాన్ని తిరిగి నేపాల్ భూభాగంలోకి తీసుకు రావడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. చైనా ఆదేశాల మేరకు లేదా ఆ దేశం అండ చూసుకొని ఓలి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని భారత్ అభిప్రాయపడుతోంది. ఇటీవల ప్రధాని మోడీ మేడిన్ ఇండియాలో భాగంగా లోకల్ ఉత్పత్తుల కోసం పిలుపునిచ్చారు. ఇది చైనాను ఆర్థికంగా భారీగా దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో చైనా కుయుక్తులు పన్నుతోంది. ఇందులో భాగంగా నేపాల్‌ను రెచ్చగొడుతోందని భావిస్తున్నారు.
Tags:    

Similar News