భారత ట్రావెల్ వ్లాగర్ నిర్బంధం.. ఈ చైనా బుద్ది మారదా?

చైనా ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అక్కడి అధికారులు భారతీయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.;

Update: 2025-12-25 07:40 GMT

చైనా ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అక్కడి అధికారులు భారతీయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత ట్రావెల్ వ్లాగర్ ను గంటల తరబడి నిర్బంధించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. అనంత్ మిత్తల్ అనే ట్రావెల్ వ్రాగర్ అరుణాచల్ ప్రదేశ్ అంశంపై మాట్లాడినందుకే చైనా అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించాడు. ‘ఆన్ రోడ్ ఇండియా’ పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే అనంత్, ఈ నెల 16న తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు.

అనంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తన స్నేహితుడిని కలిసేందుకు చైనాకు వెళ్లాడు. ‘గ్వాంగ్ జౌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ ప్రక్రియ సమయంలో ఓ సీనియర్ అధికారి తనను పక్కకు తీసుకెళ్లి ప్రత్యేకంగా కూర్చోబెట్టారని చెప్పాడు. అక్కడ తనతోపాటు కొరియా, బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించారు. దాదాపు 15 గంటల పాటు తనను నిర్బంధించి ప్రశ్నలు అడిగారని.. తన లగేజీని తనిఖీ చేసి కెమెరా ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నాడు.

నిర్బంధం సమయంలో కనీసం ఆహారం కూడా అందించలేదని.. అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడేందుకు అనుమతివ్వలేదని అనంత్ వాపోయాడు. విచారణ ముగిసిన తర్వాత తనను వదిలేశారని.. అయితే ఈ ఘటన తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని చెప్పాడు.

ఈ ఘటన నేపథ్యంగా ఇటీవల ‘అరుణాచల్ ప్రదేశ్’కు చెందిన ఓ మహిళను ‘షాంఘై విమానాశ్రయం’ లో చైనా అధికారులు నిర్బంధించిన ఉదంతాన్ని అనంత్ గుర్తు చేశాడు. అరుణాచల్ ప్రదేశ్ లో తాను మూడేళ్లు చదువుకున్నానని.. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పట్లో వీడియో చేసిన కారణంగానే ఇప్పుడు తనను టార్గెట్ చేశారని ఆయన అనుమానిస్తున్నారు.

ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. భారత ప్రభుత్వంను అనంత్ మిత్తల్ కోరాడు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకూ భారత ప్రభుత్వం లేదా అధికారవర్గాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చైనా భారత్ సంబంధాల నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags:    

Similar News