సోనియా కోటలో మోడీ వేట

Update: 2016-08-24 09:27 GMT
సాధారణంగా జాతీయ స్థాయిలో పాలక - విపక్షాలుగా ఉంటున్న పార్టీలు కొన్ని పద్ధతులు పాటిస్తాయి. ఒక పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వారి వ్యతిరేక పార్టీ అధినేతలు బహిరంగ సభలు - పాదయాత్రలు చేయరు. ఇది ఒక అలవాటుగా కొనసాగుతోంది. కానీ... ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా దాన్ని ఉల్లంఘించి మోడీ నియోజకవర్గం వారణాసిలో భారీ ర్యాలీ తీశారు.  ఆ పద్ధతికి ఆమె మంగళం పాడినట్లయింది. దీంతో తాము మాత్రం తక్కువ తిన్నామా అంటూ బీజేపీ కూడా సోనియా ఫ్యామిలీ కంచుకోటల్లో జైత్రయాత్ర మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా అమేథీలో భారీ బహిరంగ సభకు మోడీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమేథీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

 వచ్చే నెలలో జరిగే ఈ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.  అంతేకాదు.. అమేథీ తరువాత సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని బిజెపి అధినాయకులు చెబుతున్నారు. సోనియా వారణాసిలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిచ్చారు. వారిని పలకరించే సందర్భంలోనే సోనియా గాంధీ జీపు దిగి మళ్లీ ఎక్కే సమయంలో కింద పడిపోవటం తెలిసిందే. వారణాసిలో నరేంద్ర మోడీని అవమానించేందుకే కాంగ్రెస్ అధినాయకత్వం ఈ బల ప్రదర్శనకు దిగిందని బిజెపి అధినాయకత్వం ఆరోపిస్తోంది. వారణాసిలో కాంగ్రెస్ చేసిన పనినే తామిప్పుడు అమేథీ - రాయబరేలీ లోక్‌ సభ నియోజకవర్గాల్లో చేస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారు. మొదట అమేథీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం, అక్కడ తమ బలమేమిటనేది రాహుల్‌ కు చూపిస్తామని వారంటున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తరచూ అమేథీ లోక్‌ సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అమేథీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని ఆమె పలుమార్లు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. వారణాసిలో ఎన్నో అభివృద్ధి పథకాలు అమలవుతున్నా సోనియా గాంధీ మాత్రం అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని తప్పుడు ఆరోపణ చేశారని బిజెపి నేతలు మండిపడుతున్నారు. వాస్తవానికి అమేథీ - రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు, జాతీయ నాయకులుగా చెలామణి అవుతున్న రాహుల్ - సోనియా గాంధీ తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  అమేథీ బహిరంగ సభలో సోనియా, రాహుల్ లను ఎండగడతామని హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News