బాలకృష్ణ కోసం బాబు వైఎస్ కాళ్లు పట్టుకున్నారా?

Update: 2016-09-25 09:15 GMT
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు పేజీల్లో రాసిన ఆయన లేఖలో ఆయన స్వదస్తూరితో సంతకం చేయటంతో పాటు.. ఆయన లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసి ఉంది. ఇందులో పలు సంచలన అంశాల్ని పేర్కొన్నారు. తాజా లేఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు చేయటం గమనార్హం.

తుని సభకు సంబందించిన ఏపీ సర్కారు చేస్తున్న ప్రచారం లేదని చెప్పటమే కాదు.. ప్రజల ఆకలి.. బాధ కారణంగా చెప్పిన సమయానికి గంటల ముందే సభా ప్రాంగణం ప్రజలతో నిండిపోయిందన్న ముద్రగడ.. వాస్తవాల్ని గ్రహించకుండా తమపై ఎదురుదాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాపు గర్జన సభ పెట్టటానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? దీనికి వెనుక ఎవరు ఉన్నారు. జగన్? మోడీ? సోనియాగాంధీ కానీ ఉన్నారా? అని సీఐడీ అధికారుల చేత అడిగిస్తున్నారంటూ ఆరోపించిన ముద్రగడ.. తమ జాతివారు పేదవారు కాబట్టి నోటికి ఏది వస్తే ఆ మాటలు అడిగించటం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.

తమ జాతి సోదరులు లారీ డ్రైవర్ లుగా.. క్లీనర్లుగా పని చేస్తున్నారని చులకనగా ప్రశ్నిస్తారా? అన్న ముద్రగడ తాను చేసిన దీక్ష దొంగ దీక్షగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘తరచూ నాది దొంగ దీక్ష అంటూ మీ బ్యాండు మేళంతో చాటిస్తున్నారే. నాది దొంగ దీక్ష అయినప్పుడు నన్ను బంధించిన ఆసుపత్రిలో ఎందుకు వేలాది మంది పోలీసులను కాపలా ఉంచారు. రోజుకు ముగ్గురు లేదంటే నలుగురు డాక్టర్లను కాకినాడ నుంచి రాజమండ్రికి ఎందుకు రప్పించారు? దానికి కారణం ఏమిటి? ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఏదో ఇంజక్షను పేరుతో నన్ను చంపటం కోసం కాదా?’’ అని తీవ్రంగా మండిపడ్డారు.

బాబు చెప్పినట్లు తాను చేసింది దొంగ దీక్షే అనుకుంటే తాను దొంగనో.. మంచివాడినో సమాజానికి తెలియటం కోసం ప్రత్యేక హోదా కోసం గతంలో తాను ప్రకటించినట్లుగా చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేశ్ కానీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలని.. తాను కూడా వారితో కూర్చుంటానని.. ఆమరణ నిరాహార దీక్షతో నిజాన్ని నిగ్గు తేలుద్దామని సవాలు విసిరారు.

తన ఉద్యమం వెనుక జగన్ ఉన్నారని తరచూ ప్రచారం చేస్తున్నారన్న ముద్రగడ.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యను చేశారు.  ‘‘మీరు అధికారంలో లేనప్పుడు మీ పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు మంత్రుల వద్దకు కానీ.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వద్దకు కానీ వెళ్లొద్దని ఆంక్షలు విధించారే. కానీ మీ బావమరిది బాలకృష్ణ ఉదంతంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ ను అర్థరాత్రి వేళ వెళ్లి కాళ్లు పట్టుకొని మోకరిల్లి కాపాడమని వేడుకొని ఉపకారం పొందింది చంద్రబాబే కానీ నేను కాదని చెప్పటం జరిగింది’’ అని పేర్కొన్నారు.  ఈ వ్యాఖ్యల సందర్భంలో ఆయన బాబు మీదా.. బాలకృష్ణ మీద తీవ్ర ఆరోపణలు చేయటం గమనార్హం.

బాబు దయ వల్ల తనకు సిగ్గు.. లజ్జ పూర్తిగా పోయాయని.. మహా అయితే ఆఖరి అస్త్రంగా పోలీసుల చేత తన బట్టలు ఊడదీయించి బూటు కాలితో తన్నిస్తారని.. తనను ఏమైనా చేసుకోండి కానీ తమ జాతికి ఇచ్చిన హామీని అమలుచేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. సెగలు పుట్టిస్తున్న ముద్రగడ లేఖపై బాబు అండ్ కో ఎంతలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News