ఢిల్లీలో ఎంపీలకు ఉన్న విలువ సీఎంలకు ఉండదన్న వైసీపీ ఎంపీ!

Update: 2021-03-06 04:07 GMT
ఏపీ అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ తరహా వ్యాఖ్యలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. తాను మాట్లాడే మాటల విషయంలో ఆచితూచి అన్నట్లుగా.. టార్గెట్ పెట్టుకొన్న వారి మీదనే ఆరోపణల్ని సంధిస్తుంటారు. ఏ మాత్రం తొందరపడటం ఆయన మాటల్లో కనిపించదు. సొంత పార్టీ ప్రభుత్వం మీదా.. పార్టీ నేతలపైనా విరుచుకుపడే ఆయన.. తరచు వార్తల్లో కనిపిస్తుంటారు.

ఇంత చేసే ఆయన.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాత్రం పల్లెత్తు మాట అనుకుండానే ఆయన్ను చిరాకు పెట్టేస్తుంటారు. అలాంటి ఎంపీ రఘురామకృష్ణరాజు.. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు సీఎం పక్కనున్న వారుకుట్రలు చేస్తున్నారని అనుకున్నట్లు చెప్పారు. కానీ.. ఆ కుట్రలో సీఎం కూడా ఉన్నారని తాను అనుకోలేదన్నారు. తనపై పెట్టిన కేసులు కోర్టుల్లో చెల్లవని చెప్పిన ఆయన హోం శాఖ సెక్రటరీకి కంప్లైంట్ చేసినట్లు చెప్పారు.

ఏపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్న ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి అహంకారం తారా స్థాయిలో ఉందన్నారు. ఢిల్లీలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టించుకోరని.. కేంద్రానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమానమేనన్నారు. అంతేకాదు.. ఢిల్లీలో ఎంపీకి ఇచ్చిన విలువ.. ప్రాధాన్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వరన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేదని తాను గతంలోనే చెప్పానని.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు. ఒకవేళ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తే.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మొత్తంగా రోటీన్ కు భిన్నంగా ఈసారి తన విమర్శనాస్త్రాన్ని సీఎం జగన్ మీదకే నేరుగా సంధించిన ఎంపీ రఘురామ తీరు సంచలనంగా మారింది.
Tags:    

Similar News