తమిళ సైతో చిరు భేటీ వెనుక కారణం ఇదేనా?

Update: 2020-06-03 05:15 GMT
గతంలో ప్రముఖుల పుట్టినరోజు సందర్భంలో వ్యక్తిగతంగా ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పేవారు. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసే వారు కాదు. ఏదైనా ఎజెండా ఉండి ఉంటే.. తాము సదరు ప్రముఖుడికి శుభాకాంక్షలు చెప్పిన విషయాన్ని మీడియాలో వచ్చేలా జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకోసం మీడియా ప్రతినిధుల్ని అభ్యర్థించేవారు. తమకున్న వ్యక్తిగత సంబంధాల్ని వినియోగించుకునేవారు. మారిన కాలంతోపాటు.. శుభాకాంక్షలు చెప్పే తీరు మారిపోయింది.

ప్రముఖుల పుట్టినరోజు అయితే చాలు.. సోషల్ మీడియాలో ట్వీట్లు.. పోస్టులు పెట్టేసి హడావుడి చేస్తున్నారు. అక్కడితో పని పూర్తి అయిపోనట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రం సోషల్ మీడియాలో విషెస్ చెప్పి.. వ్యక్తిగతంగా ఫోన్లు చేయటం చూస్తుంటాం. అందుకు భిన్నమైన సీన్ తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి గవర్నర్ సైతం స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం చిరు దంపతులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ దంపతుల్ని కలవటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో ఎవరైనా ప్రముఖుల పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేసి విషెస్ చెప్పి.. మళ్లీ కలవటం పెద్దగా జరిగింది లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనతో పాటు తన సతీమణిని చిరు వెంటపెట్టుకెళ్లటం మరో ముఖ్యమైన పరిణామంగా చెప్పాలి. ఈ రెండే కాదు.. మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. రాజ్ భవన్ కు వెళ్లిన చిరు డ్రెస్సింగ్ చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

పంచె.. షర్టుతో సగటు తమిళుడి మాదిరి చిరు వెళ్లిన తీరు చూస్తే.. ఆయన భేటీ వ్యూహాత్మకంగా చెప్పాలి. సాధారణంగా తమిళులకు తమ సొంత రాష్ట్రం మీద కాస్త ఎక్కువ అభిమానాన్నే ప్రదర్శిస్తారు. ఆ విషయం చిరుకు తెలియంది కాదు. ఆయన సినీ కెరీర్ మొదట్లో గడిచిందంతా చెన్నైలోనే. అందుకే కాబోలు.. తన డ్రెస్సింగ్ తో తనలోని ‘తమిళుడి’ని చిరు చెప్పకనే చెప్పారని చెప్పాలి. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిరు అందరివాడిగా మారుతున్నారు.

దీనికి నిదర్శనంగా తెలుగు చిత్రపరిశ్రమ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన టీంకు చిరు నాయకత్వం వహించటం.. అదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో జరిగిందన్న విషయం ఇటీవల బయటకు రావటం తెలిసిందే. ఆ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఆయన ఇంట్లో కలవటం.. ఆసందర్భంగా వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకోవటం చూస్తే.. తాను అందరివాడినన్న విషయాన్ని చేతలతో చేసి చూపిస్తున్నారని చెప్పాలి. ఏమైనా.. గవర్నర్ తమిళ సైతో చిరు భేటీ రోటీన్ కు భిన్నమన్న మాట బలంగా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన పరిణామాలు చోటు చేసుకునే వీలుందంటున్నారు. 
Tags:    

Similar News