మనోళ్ల కంటే ఎక్కువగా తాగే ఐరోపావారు ఎందుకు సేఫ్?
ఐరోపావాసుల్లో ఆల్కహాల్ డీహైడ్రోజినేస్, ఆల్డిహైడ్ డీహైడ్రోజినేస్ ఎంజైమ్ లు మరింత క్రియాశీలకంగా ఉంటాయి.;
మనోళ్లతో పోలిస్తే పలువురు విదేశీయులు భారీగా తాగేస్తుంటారు. కొన్ని దేశాల్లోని వారైతే.. మందును మంచినీళ్లుగా తాగేసే వారున్నారు. మరి.. వారికి రాని జబ్బులు.. ఆరోగ్య సమస్యలు మనకే ఎందుకు వస్తాయి? అన్న ప్రశ్న పలువురి మదిని తొలిచేస్తుంటుంది. ఇదే అంశాన్ని ఒక వైద్యుడు తన తాజా వీడియోలో వివరిస్తూ.. అందుకు కారణాల్ని శాస్త్రీయంగా విశ్లేషించిన వైనం ఆకట్టుకునేలా మారింది. దీంతో.. ఆయన వీడియో వైరల్ గా మారింది.
భారతీయుల కంటే ఐరోపావాళ్లు ఎక్కువగా తాగినా వారిలో ఫ్యాటీ లివర్ ముప్పు తక్కువగా ఎందుకు ఉంటుంది? అన్న విషయాన్ని హర్ష్ వ్యాస్ అనే వైద్యుడు ఇన్ స్టాలో పెట్టిన పోస్టు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఆయన ఏమన్నారు? ఆయన వినిపించిన వాదన ఏమన్నది ఆ వైద్యుడి మాటల్లోనే చూస్తే.. ‘‘ఐరోపా వారి కంటే భారతీయులు ఎక్కువగా అల్కహాల్ సంబంధిత ప్యాటీ లివర్ బారిన పడటానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.
ఐరోపావాసుల్లో ఆల్కహాల్ డీహైడ్రోజినేస్, ఆల్డిహైడ్ డీహైడ్రోజినేస్ ఎంజైమ్ లు మరింత క్రియాశీలకంగా ఉంటాయి. దీని కారణంగా ఎక్కువగా తాగితే ఒంట్లో ఏర్పడే వ్యర్థాలను ఇవి వేగంగా తొలగిస్తాయి. ఆసియా దేశాల వారిలో ఈ ఎంజైమ్ ల క్రియాశీలత తక్కువ. దీంతో వ్యర్థాలు ఎక్కువసేపు ఒంట్లో ఉండిపోతాయి’’ అంటూ పలు అంశాల్ని ప్రస్తావించారు.
అంతేకాదు.. ఐరోపా వాసులు తినే ఆహారంలో ఉండే తేడాలు కూడా వారికి మేలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో మనోళ్లు తినే ఫుడ్ కూడా ఆరోగ్య సమస్యకు కారణంగా వివరించారు. దీనికి తోడు లైఫ్ స్టైల్ అంశాల్ని కూడా సదరు డాక్టర్ ప్రస్తావించారు. ‘ఐరోపా వాసులు తినే ఫుడ్ లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యకర కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.
వారు తినే చేపలు.. ఇతర సముద్ర ఆహారం.. ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వారి ఫుడ్ లో ఉండటం ఒక కారణం. దీంతో ప్రోటీన్లు ఆరోగ్య కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. భారతీయులు తినే ఫుడ్ లో రిఫైన్డ్ కొర్బోహైడ్రేట్ లు ఎక్కువ. దీనికి తోడు ఆరోగ్యకరమైన కొవ్వులు.. ప్రోటీన్లు తక్కువగా ఉండటం మరో కారణం’’ అని పేర్కొన్నారు.
ఈ కారణాలతో కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుని ఫ్యాటీ లివర్ కు దారి తీస్తుందన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఐరోపా వాసులు అధికశాతం వర్కువుట్స్ మీద ఫోకస్ చేస్తారని.. భారతీయుల్లో అత్యధికులు వ్యాయామం చేయరన్నారు. కనీసం ఐదు కిలోమీటర్లు కూడా నడవరన్న ఆయన.. ఈ కారణాలే ఆరోగ్య సమస్యల్ని మరింత పెంచుతాయన్నారు. ఆయన చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.