తారిక్ రెహమాన్ కేబినెట్ లో హిందూ మంత్రి!

బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఆ దేశంలోని జాతీయ సంసద్ భవన్‌లోని సౌత్ ప్లాజాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.;

Update: 2026-02-17 19:30 GMT

బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఆ దేశంలోని జాతీయ సంసద్ భవన్‌లోని సౌత్ ప్లాజాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్‌పి అధినేత తారిక్ రెహమాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ తారిక్ రెహమాన్ తో పాటు మొత్తం మంత్రి మండలితో ప్రమాణం చేయించారు. దాంతో దాదాపుగా ఇరవై నెలల తరువాత కొత్త ప్రభుత్వం ప్రజల ఓట్లతో అధికారం చేపట్టినట్లు అయింది. తారిక్ రెహమాన్ నేతృత్వంలో 50 మంది సభ్యులు మంత్రివర్గంలో చేరారు.

హిందూ నేతకు చాన్స్ :

ఇదిలా ఉంటే తారిక్ రెహమాన్ మంత్రివర్గంలో హిందూ నాయకుడికి మంత్రిగా అవకాశం లభించడం మీద చర్చ సాగుతోంది. ఆయన పేరు నితై రాయ్ చౌదరి. మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన అక్కడ ప్రముఖ హిందూ మైనారిటీ వ్యక్తిగా ఉన్నారు. అంతే కాదు సీనియర్ రాజకీయ నాయకుడుగా కూడా ఉన్నారు. తారిక్ రెహమాన్ ప్రధానిగా ఉన్న కేబినెట్ లో నితై రాయ్ చౌదరిని తీసుకోవడం ఒక వ్యూహాత్మకమైన విషయంగా చెబుతున్నారు.

మైనారిటీల కోసం :

ఇక బంగ్లాదేశ్ లో గడచిన కాలంలో అల్లర్లు పెద్ద ఎత్తున జరిగాయి. అంతే కాదు వరసగా హిందువులు హత్య కావించబడ్డారు. ఈ నేపధ్యంలో కొత్త ప్రభుత్వం అక్కడ మైనారిటీలలో పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులకు భరోసా ఇచ్చేందుకు గానూ నితై రాయ్ చౌదరిని మంత్రి వర్గంలోకి తీసుకుంది అని అంటున్నారు. అలా నితై రాయ్ చౌదరి కేబినెట్ లో చేరడం ద్వరా తారిక్ రహమాన్ పరిపాలనలో మైనారిటీ ప్రాతినిధ్యం కోసం ప్రాముఖ్యత ఇస్తుంది అన్నసందేశాన్ని పంపించినట్లు అయింది అని అంటున్నారు.

ఎవరీ నితై రాయ్ చౌదరి :

ఇదిలా ఉంటే నితై రాయ్ చౌదరి అనుభవజ్ఞుడైన బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు గా న్యాయవాదిగా ఉన్నారు. దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. 1949 జనవరి 7న మగురా జిల్లాలోని మొహమ్మద్‌పూర్‌లోని హత్బారియా గ్రామంలో జన్మించిన ఆయన 1988 నాలుగో జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీ టికెట్‌పై మగురా-2 నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. చౌదరి బిఎన్‌పిలో చేరి క్రమంగా పార్టీలో ఎదిగారు. ఆయన బిఎన్‌పి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు పార్టీ అగ్ర నాయకత్వానికి సీనియర్ సలహాదారుగా మరియు వ్యూహకర్తగా సైతం ఉన్నారు. అలాగే, ఆయన బిఎన్‌పి యొక్క అత్యున్నత విధాన రూపకల్పన స్టాండింగ్ కమిటీ సభ్యుడు కూడా. తాజా ఎన్నికల్లో చౌదరి మగురా-2 నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

తొలి పురుష ప్రధాని :

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ ని గత మూడున్నర దశాబ్దాలుగా మహిళలే ప్రధానులుగా ఏలుతున్నారు. చివరిగా పురుష ప్రధానిగా పనిచేసిన వారు చూస్తే కాజీ జాఫర్ అహ్మద్ గా చెబుతారు ఆయన జతియా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, ఆయన 1989 నుండి 1990 వరకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత ఇన్నేళ్ళకు మళ్ళీ పురుష ప్రధానిగా బిఎన్‌పికి చెందిన తారిక్ రెహమాన్ ప్రధాని అయ్యారు.

తల్లి వారసత్వం :

ఇక తారిక్ రెహమాన్ తన తల్లి ఖలీదా జియాకి రాజకీయ వారసుడిగా బిఎన్‌పి కి నాయకత్వం వహిస్తూ ప్రధాని పీఠాన్ని తొలిసారి అందుకున్నారు. ఖలీదా జియా ఆమె 1991 నుండి 1996 వరకు తొలిసారి ప్రధానిగా చేశారు తిరిగి 2001 నుండి 2006 వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఆమె పనిచేశారు. ఆమె బంగ్లాదేశ్ యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక 2024 లో మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతుడైన తర్వాత తాజాగా జరిగిన తొలి జాతీయ ఎన్నికల్లో బిఎన్‌పి నిర్ణయాత్మక ఆధిక్యాన్ని సాధించింది. ఆ పార్టీ 209 స్థానాలను గెలుచుకోగా, దాని మిత్రపక్షాలు మరో మూడు స్థానాలను గెలుచుకున్నాయి, దీనితో 300 మంది సభ్యుల పార్లమెంటులో సంకీర్ణానికి స్పష్టమైన మెజారిటీ లభించింది.

నేరుగా పీఠం మీదకు :

ఇక తారిక్ రెహమాన్ విషయానికి వస్తే ఏకంగా 17 ఏళ్ల పాటు విదేశాల్లో ఉన్నారు. గత ఏడాది చివరిలో బంగ్లాదేశ్ కి వచ్చారు. రావడమే నేరుగా ప్రధాని పీఠానికి చేరువ అయ్యారు. ఇక ఆయన కేబినెట్ లో 25 మంది మంత్రులు, 24 మంది రాష్ట్ర మంత్రులు మరియు ముగ్గురు టెక్నో క్రాట్స్ ఉన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారతదేశం తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు.

Tags:    

Similar News