అంత తొంద‌రెందుకు: అయోధ్య 'దోపిడీ'పై సుప్రీం వ్యాఖ్య‌లు

దేశాన్ని కుదిపేస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య రామమందిరం విరాళాల దోపిడీ వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Update: 2026-06-29 17:47 GMT

దేశాన్ని కుదిపేస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య రామమందిరం విరాళాల దోపిడీ వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసును అంత అత్య‌వ‌స‌రంగా విచారించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. అంతేకాదు.. ``ఇప్ప‌టికిప్పుడు ఈ కేసు విచార‌ణ‌కు తీసుకోక‌పోయినా.. ఎలాంటి న‌ష్టం లేద‌ని.. మిన్ను విరిగి మీద ప‌డ‌దు`` అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసును వ‌చ్చే నెల‌లో విచార‌ణకు స్వీక‌రిస్తామ‌ని తెలిపింది.

ఏంజ‌రిగింది?

అయోధ్య రామమందిరంలో గ‌త ఏడాది న‌వంబ‌రు నుంచి ఈ ఏడాది మార్చి మ‌ధ్య భ‌క్తులు స‌మ‌ర్పించిన కోట్ల రూపాయ‌ల విరాళాలు, కిలోల కొద్దీ న‌గ‌ల వ్య‌వ‌హారంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని స్థానిక ఎంపీ ఆరోపించారు. దీంతో తొలుత దీనిని రాజ‌కీయంగానే చూసినా.. ఆ త‌ర్వాత బీజేపీ ఎంపీలు కూడా ఇదే విష‌యాన్ని ఢిల్లీ వ‌ర‌కు తీసుకువెళ్లారు. దీంతో యూపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. రంగంలోకి దిగిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అన్ని విష‌యాలు సేక‌రిస్తున్నారు.

ఈ నెల 5నే రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టుకు దోపిడీ వ్య‌వ‌హారం తెలుసున‌ని.. ఇంటి దొంగ‌లే ఈ ఉదంతానికి వ‌డి గ‌ట్టార‌ని అధికారులు గుర్తించారు. మొత్తంగా విరాళాలు లెక్కించే సిబ్బందిలో అనుక‌ల్ప్ మిశ్ర స‌హా.. 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దోపిడీ ఇప్ప‌టిది కాద‌ని కూడా గుర్తించారు. దాదాపు ఆరు మాసాలుగా జ‌రుగుతోంద‌ని.. ట్ర‌స్టుకు కూడా ఈ విష‌యం తెలుసున‌ని.. అయినా మౌనంగా ఉంద‌ని అధికారులే చెబుతున్నారు.

ఈ వ్య‌వ‌హారంలో పెద్ద త‌ల‌కాయ‌ల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో అయోధ్య‌కు చెందిన ఓ వ్య‌క్తి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ కేసును స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్ప‌గించాల‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌మేయం ఉన్న వారిని త‌ప్పించాల‌ని కోరారు. అదేస‌మ‌యం లో నిర్ణీత స‌మ‌యంలోగా విచార‌ణ‌ను పూర్తి చేసేలా ఆదేశించాల‌ని కూడా విన్న‌వించారు., ఈ క్ర‌మంలో ఈ పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు.

అయితే.. సుప్రీంకోర్టు ఈ విన్న‌పాన్ని తోసిపుచ్చింది. అంత అత్య‌వ‌స‌రంగా కేసును విచారించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ముందు రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు విచార‌ణ చేస్తున్న నేప‌థ్యంలో దీనిపై అంత తొంద‌ర ఎందుక‌ని ప్ర‌శ్నించింది. వేస‌వి సెల‌వుల అనంత‌రం(ఆగ‌స్టు) కేసును విచార‌ణ‌కు తీసుకుంటామ‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News