జనసేన నేత హత్యకు సుపారీ.. అసలు వాస్తవం వేరే.. వైసీపీ నేత సెల్ఫీ వీడియో

గుంటూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకు సుపారీ ఇచ్చారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు నరేంద్రరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

Update: 2026-08-18 09:34 GMT

గుంటూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకు సుపారీ ఇచ్చారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు నరేంద్రరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. శ్రీనివాస్ యాదవ్ హత్యకు తాను రూ.కోటి సుపారీ ఇచ్చానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశాడు. రాజకీయ కారణాలతోనే జనసేన, టీడీపీ నేతలు తనను వేధిస్తున్నారని ఆయన విడుదల చేసిన వీడియోలో ఆరోపించాడు.

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ హత్యకు ప్లాన్ జరిగినట్లు సోమవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గుంటూరు నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ తో వైసీపీ నేత నరేంద్రరెడ్డి రూ.కోటి సుపారీ మాట్లాడారని, రౌడీషీటర్ రెక్కీ నిర్వహించినట్లు ఆరోపణలు చేశారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జనసేన నేతల ఫిర్యాదుతో గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా, తనపై చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమని, రూ.కోటి ఉంటే తన పిల్లలను చదివించుకుంటాను కానీ, ఎవరినో చంపడానికి ఎందుకిస్తానంటూ వైసీపీ నేత నరేంద్రరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ రెండేళ్లుగా తనను టార్గెట్ చేశాడని, కక్షతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆ వీడియోలో తెలిపాడు. 2024 డిసెంబరులో బోనబోయిన శ్రీనివాసయాదవ్ అనుచరులు తన బార్ లో మద్యం తాగి బిల్లు చెల్లించలేదని, ఆ డబ్బు అడిగినందుకు తనతో వివాదం పెట్టుకున్నారని ఆరోపించాడు. అదేవిధంగా గత ఏడాది దీపావళి సమయంలో బోనబోయిన అనుచరులు తన కుమార్తెపై బాంబులు వేశారని, అడిగినందుకు తనపై దాడి చేశాడని ఆ వీడియోలో వివరించాడు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టిలో పడేందుకు తనను టార్గెట్ చేస్తున్నాడని, తన బార్ ను కూల్చేశారని, అదే స్థలంలో ఇప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వారు మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు.

మొత్తానికి వైసీపీ నేత నరేంద్రరెడ్డి విడుదల చేసిన వీడియోతో సుపారీ హత్య కేసు కీలక మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు. జనసేన నేత బోనబోయినకు వైసీపీ నేత నరేంద్రరెడ్డికి మధ్య చాలా కాలంగా వ్యాపార, వ్యక్తిగత వివాదాలు నడుస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారానికి పార్టీలకు సంబంధం లేకపోయినా పార్టీ రంగు పులమాలని చూస్తున్నారని వైసీపీ నేత నరేంద్రరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయని అంటున్నారు. కాగా, సెల్ఫీ వీడియో విడుదల చేసిన వైసీపీ నేత నరేంద్రరెడ్డి గతంలో చోటుచేసుకున్న పలు వివాదాలు, ఆయన బార్ ను నేలమట్టం చేసిన దృశ్యాలను కూడా వీడియోలో ప్రదర్శించాడు. దీంతో జనసేన నేతపై హత్యాయత్నం కేసు మలుపు తిరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.




Tags:    

Similar News