సముద్రంలో డేటా సెంటర్ల ట్రెండ్- బంగాళాఖాతంలో పాజిబులేనా?
కృత్రిమ మేధ (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో దానికి అవసరమైన డేటా సెంటర్ల కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది.
కృత్రిమ మేధ (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో దానికి అవసరమైన డేటా సెంటర్ల కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది. ఈ సాంప్రదాయ భూ ఆధారిత డేటా సెంటర్లు విపరీతమైన విద్యుత్, మంచినీరు .. వందలాది ఎకరాల స్థలాన్ని ఆక్రమిస్తూ వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ఈ పర్యావరణ, వనరుల సమస్యలకు పరిష్కారంగా సాంకేతిక దిగ్గజాలు, పరిశోధకులు ఇప్పుడు సముద్రాల వైపు దృష్టి సారిస్తూ అంతర్భాగ ఐటీ మౌలిక సదుపాయాలను ప్రోత్సహిస్తున్నారు.
సముద్ర ఆధారిత ఐటీ వ్యవస్థలలో భాగంగా పలు దేశాలు సముద్ర గర్భంలో.. నీటి ఉపరితలంపై తేలియాడే డేటా సెంటర్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. స్కాట్లాండ్ తీరంలో మైక్రోసాఫ్ట్ చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో.. చైనా షాంఘైలో పవన విద్యుత్‌తో నడిచే సముద్ర అంతర్భాగ డేటా సెంటర్‌ను నిర్మించి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. అలాగే జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా భూమి కొరతను అధిగమించడానికి సీ-వాటర్ కూలింగ్ .. పవన, సౌర శక్తులతో నడిచే తేలియాడే డేటా సెంటర్ల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
సముద్ర ఆధారిత డేటా సెంటర్ల వల్ల ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. సముద్రపు నీటిని నేరుగా కూలింగ్ కోసం ఉపయోగించడం ద్వారా మంచినీటి అవసరం తగ్గడమే కాకుండా దాదాపు 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అంతేకాకుండా ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు తీరప్రాంతాలకు సమీపంలోనే నివసిస్తుండటం వల్ల వినియోగదారులకు వేగవంతమైన డేటా సేవలు అందించడం సులువవుతుంది. సీల్డ్ వాతావరణంలో ఉండటం వల్ల పరికరాలు దెబ్బతినే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
అయితే ఈ ప్రయోజనాలతో పాటు సాంకేతిక- పర్యావరణపరమైన సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. సముద్ర గర్భంలో ఉన్న సర్వర్లలో చిన్న లోపం తలెత్తినా..., దాన్ని సరిచేయడానికి మొత్తం డేటా సెంటర్ మాడ్యూల్‌ను నీటిపైకి తీసుకురావాల్సి రావడం ఒక పెద్ద నిర్వహణ సమస్యగా మారింది. మరొక ప్రధాన ముప్పు ఏంటంటే.. డేటా సెంటర్ల నుండి వెలువడే వేడి నీటిని తిరిగి సముద్రంలోకి వదలడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి పగడపు దిబ్బలు- మత్స్య సంపద- జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
సముద్రపు అంతర్భాగ డేటా సెంటర్లు ఏఐ రంగానికి అవసరమైన ఇంధనం- భూమి- మంచినీటి భారాన్ని తగ్గించడంలో ఒక ఆశాజనకమైన విప్లవాత్మక మార్పుగా కనిపిస్తున్నాయి. కానీ ఈ సాంకేతికత సముద్ర పర్యావరణ వ్యవస్థను మరింత దెబ్బతీయకుండా చూడటంలోనే దీని అసలు విజయం ఆధారపడి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక లభ్యత, సాంకేతిక సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొంటేనే సముద్రాలు AI విప్లవానికి సుస్థిరమైన భవిష్యత్తుగా మారగలవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
విశాఖపట్నం వంటి తీర ప్రాంత నగరానికి సమీపంగా గూగుల్ డేటాసెంటర్ తో పాటు, అధాని డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, ఆర్.ఎం.జెడ్ అండ్ కోల్ట్ అనే దిగ్గజ సంస్థ భారీ డేటా సెంటర్ లను ఏర్పాటు చేస్తుండటంతో ప్రస్తుతం ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ గురించి విస్త్రత చర్చ సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ లో విశాఖ నుంచి శ్రీకాకుళం మధ్యలో ఉన్న సముద్రంపైనా ఇంకా మరిన్ని భారీ డేటాసెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.