బీజేపీ కొత్త బృందం...బలమైన ఆర్‌ఎస్‌ఎస్ ముద్ర
భారతీయ జనతా పార్టీ పెద్దలకు వర్తమాన రాజకీయ పరిణామాలు కొంత కలవరం కలిగిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ పెద్దలకు వర్తమాన రాజకీయ పరిణామాలు కొంత కలవరం కలిగిస్తున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న విద్యార్థుల నిరసన ఉద్యమం అసలు కలలో కూడా ఊహించలేనిది. ఏ నాయకుడూ లేడు, ఏ రాజకీయ పార్టీ లేదు, కేవలం జెన్ జీ యువత అత్యంత బలమైన ప్రభుత్వంగా చెప్పబడుతున్న ఎన్ డీయేని దారికి తెచ్చి తమ డిమాండ్లు సాధించుకుంది. అంతే కాదు ఈ రోజుకీ జెన్ జీ సోషల్ మీడియా వేదికగా తమ అసహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇది బీజేపీ పెద్దలకు ప్రభుత్వాన్ని ఏలుతున్న వారిలో ఆందోళన పెంచుతోంది. దాంతో గతంలో మాదిరిగా దూకుడు చేయడం లేదు, ఏక పక్ష విధానాలకు సాహసించడం లేదు, మాతృ సంస్థగా చెప్పబడుతున్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయాన్ని సహకారాన్ని అనివార్యంగా కోరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే బీజేపీ కొత్త బృందం మీద ఆర్‌ఎస్‌ఎస్ బలమైన ముద్ర పడింది అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నాడు కాదనుకుని నేడు తెచ్చి :
బీజేపీ కొత్త బృందంలో ఒక పేరు అయితే చాలా మందిలో ఆలోచనలు రేకెత్తించింది. ఆ పేరు వారణాసి రామ్ మాధవ్. ఆయన మేధావి, ఆర్‌ఎస్‌ఎస్ కి బలమైన నాయకుడు. ఏపీలోని గోదావరి జిల్లాలకు చెందిన రామ్ మాధవ్ ఒకనాడు బీజేపీకి తన సేవలను అందించారు. 2015లో జమ్మూ కాశ్మీర్ లో పిడిఎఫ్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు వెనక ఆయన కృషి ఎంతో ఉంది. అంతే కాదు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి 28 సీట్లు రావడానికి ఆయన పడిన కష్టం ఉంది. అలాంటి ఆయన ఎందుకో తరువాత రోజులలో బీజేపీకి దూరం అయ్యారు. మళ్ళీ ఇపుడు ఆయన పేరు కనిపించింది. అయిదారేళ్ళ సుదీర్ఘమైన సమయం తరువాత రామ్ మాధవ్ బీజేపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయనకు జాతీయ ఉపాధ్యక్షుడిగా అత్యంత కీలకమైన స్థానం దక్కింది. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత బద్ధుడు. అలాంటి ఆయనను ఏరి కోరి బీజేపీ బృందంలో ఉంచారు అంటే ఆర్‌ఎస్‌ఎస్ ముద్ర ఎంత బలంగా పనిచేస్తో అని అంటున్నారు.
జాతీయ అధ్యక్షుడు కావాల్సింది :
నిజానికి చూస్తే దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ బలోపేతం కావడానికి అధికారం వివిధ రాష్ట్రాలలో చేపట్టడానికి రామ్ మాధవ్ చేసిన కృషి ఎంతగానో ఉంది అని అంటారు. ఆయనకు జేపీ నడ్డా కార్యవర్గంలో చోటు ఎందుకో దక్కలేదు. దాంతో ఆయన కేవలం సంఘీయుడిగానే ఉంటూ తన కార్యకలాపాలు చేసుకుంటూ వచ్చారు. ఇక రామ్ మాధవ్ పేరు ఒక దశలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో అప్పట్లో వినిపించింది. అయితే ఆనాడు ఎందుకో సాధ్యపడలేదు అని చెబుతారు. ఇపుడు కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా ఆయనకు మిగిలిన వారి కంటే విశేష ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు ఆయనకు మరిన్ని బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీని బలోపేతం చేస్తేందుకు ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. మళ్ళీ బీజేపీలో రామ్ మాధవ్ క్రియాశీలం కావడంతో ఆయన వ్యూహాలు ఎంతగానో దోహదపడతాయని అంటున్నారు.
వీరంతా సైతం :
కేవలం రామ్ మాధవ్ మాధవ్ మాత్రమే కాదు సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు కీలక పదవులు దక్కాయి. వారిని గతంలోనూ ఇపుడూ కొనసాగిస్తున్నారు అంటే ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం గట్టిగానే ఉంది అని అర్ధం అవుతోంది. ఇక బీజేపీ కొత్త కార్యవర్గం ఎంపిక పదవుల పంపిణీ వెనక ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక మీదట బీజేపీ మరింత బలంగా జనంలోకి వెళ్ళాలన్న అజెండా ఉంది. వచ్చే ఏడాది ఏకంగా ఆరేడు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. వాటిని గెలుచుకోవడమే కాదు 2029 కి రోడ్ మ్యాప్ ని రెడీ చేయాల్సి ఉంది. అందుకే బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ కలసి మెలసి ముందుకు సాగుతున్నాయని అంటున్నారు.