అదే జ‌రిగితే.. జిల్లాకు చంద్ర‌బాబు పేరు!

టీడీపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నాలుగు మాసాల కింద‌ట రెండు కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసింది.

Update: 2026-08-18 04:59 GMT

టీడీపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నాలుగు మాసాల కింద‌ట రెండు కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల ఏర్పాటుకు సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేసిన ప్ర‌భుత్వం..అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌నుంచి అభిప్రాయాలు సేక‌రించింది. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో మారుమూల ప్రాంతంగా ఉన్న మార్కాపురాన్ని ప్ర‌త్యేక జిల్లాగా ఏర్పాటు చేసింది. అలానే..గిరిజ‌నుల‌కు కేటాయించిన పోల‌వ‌రం ప్రాంతాన్ని కూడా ప్ర‌త్యేక జిల్లాగా నిర్దేశించింది. వాస్త‌వానికి ఈ రెండు జిల్లాల్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాల‌న్న‌ది వైసీపీ హ‌యాంలోనే ఇక్క‌డి ప్ర‌జ‌ల డిమాండ్‌.

అయితే.. వైసీపీ హ‌యాంలో 13 జిల్లాల‌ను పార్ల‌మెంటు సెగ్మెంట్ల వారీగా 26 జిల్లాలుగా(వాస్త‌వానికి 25 పార్ల‌మెంటు స్థానాలే ఉన్నాయి. కానీ, అర‌కు పార్ల‌మెంటు ప‌రిధి పెద్ద‌ది కావ‌డంతో దీనిని రెండు జిల్లాలుగా విభ‌జించారు.) ఏర్పాటు చేశారు. ఈ స‌మ‌యంలోనే త‌మ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఉద్య‌మించారు. కానీ, వైసీపీ ప‌క్క‌న పెట్టింది. ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. తాము అధికారంలోకి వ‌స్తే.. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత హామీని నిల‌బెట్టుకున్నారు.

మార్కాపురం జిల్లా ప‌రిధి విష‌యానికి వ‌స్తే..మార్కాపురంలోని 15 మండలాలు, కనిగిరిలోని 6 మండలాలను క‌లిపి ఏర్పాటు చేశారు. అలానే.. 3 మున్సిపాలిటీలు (మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి), 1 నగర పంచాయతీ (పొదిలి) కూడా దీనిలో భాగంగా ఉన్నాయి. ఇక‌, 406 గ్రామ పంచాయతీలు కూడా ఈ జిల్లాలో క‌లిసిపోయాయి. సరిహద్దుల విష‌యానికి వ‌స్తే.. తూర్పున పల్నాడు, ప్రకాశం జిల్లాలు; పశ్చిమాన నంద్యాల జిల్లా, ఉత్తరాన తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా, దక్షిణాన వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

తాజాగా డిమాండ్

ఇక‌, తాజాగా మార్కాపురం జిల్లా ప్ర‌జ‌లు త‌మ జిల్లా పేరును మార్చాల‌ని కోరుతున్న‌ట్టు ఎమ్మెల్యే కందుల నారాయ‌ణ‌రెడ్డి తెలిపారు. మార్క‌పురం జిల్లాను.. `చంద్ర‌న్న మార్కాపురం జిల్లా`గా మార్చాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ట్టు ఆయ‌న ఏకంగా అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడికి విన‌తి ప‌త్రం ఇచ్చారు. దీనిని ఆయ‌న ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి పంపించారు. కాగా..ఈ విష‌యంపై మంగ‌ళ‌వారం జరిగే మంత్రి వ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగి.. మార్కాపురం జిల్లా ప్ర‌జ‌ల కోరిక నెర‌వేరితే.. తొలిసారి రాష్ట్రంలో ఒక జిల్లాకు చంద్ర‌బాబు పేరు రావ‌డం ఖాయ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News