మనది బిచ్చగాళ్ల దేశమనుకుంటున్నారు.. పరువు తీయొద్దు.. పాక్‌ ఆవేదన అంతా ఇంతా కాదు..

దీంతో చివరికి "బాబోయ్.. దేశానికి బిచ్చగాళ్ల దేశమనే ముద్ర వేయకండి.. కొంచెం పరువు నిలబెట్టండి" అని పౌరులను బతిమాలుకునే పరిస్థితికి వచ్చింది.

Update: 2026-08-18 05:50 GMT

విదేశాలకు వెళ్తే "మా దేశం గొప్పది" అని గర్వంగా చెప్పుకోవాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు మాత్రం ఇప్పుడు ఓ విచిత్రమైన అంతకంటే ఘోరమైన టెన్షన్ పట్టుకుంది. విదేశాలకు వెళ్లిన తమ పౌరులు దేశం పేరు నిలబెట్టడం దేవుడెరుగు... పవిత్ర స్థలాల్లో కూడా ‘భిక్షా పాత్ర’ పట్టుకుని నిలబడుతుండటంతో ఇస్లామాబాద్‌ సర్కార్‌కి ఎక్కడలేని చమటలు పడుతున్నాయి.

ముఖ్యంగా సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా వంటి అత్యంత పవిత్ర ప్రాంతాలకు ‘ఉమ్రా వీసా’ల మీద వెళ్లి.. అక్కడ భిక్షాటనకు దిగుతున్న ఘనుల సంఖ్య పెరుగుతుండటంతో పాక్‌ ఎంబసీకి తలఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. దీంతో చివరికి "బాబోయ్.. దేశానికి బిచ్చగాళ్ల దేశమనే ముద్ర వేయకండి.. కొంచెం పరువు నిలబెట్టండి" అని పౌరులను బతిమాలుకునే పరిస్థితికి వచ్చింది.

ఏఐ వీడియోతో గట్టి వార్నింగ్

కేవలం మాటలతో చెబితే మనోళ్లు వినేలా లేరనుకున్నారో ఏమో... పాక్‌ ప్రభుత్వం ఈసారి కాస్త క్రియేటివిటీ ఉపయోగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేసి ప్రచారం చేస్తోంది. అందులో ఒకాయన సౌదీలో చేయి చాచడం... మరుక్షణమే అక్కడి పోలీసులు వచ్చి చేతులకు బేడీలు వేసి జైల్లో తోయడం కనిపించింది. అంటే "అక్కడ చేయి చాస్తే డబ్బులు రాలడం మాట దేవుడెరుగు... చేతులకు కడియాలు పడటం ఖాయం" అని సెటైరికల్ గా హెచ్చరించారన్నమాట!

లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..

పాక్ అధికారులు వెల్లడించిన అధికారిక గణాంకాలు చూస్తే ఈ ‘భిక్షాటన అడ్వెంచర్ల’ వ్యవహారం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. వీసా నిబంధనల ఉల్లంఘన, భిక్షాటన, అక్రమ నివాసం కారణాల వల్ల 2025లోనే వివిధ గల్ఫ్ దేశాల నుంచి ఏకంగా 38,616 మంది పాకిస్థానీయులు వెనక్కి పంపబడ్డారు. పవిత్ర యాత్రల పేరు చెప్పి బయలుదేరుతున్న వారి ప్రయాణ ఉద్దేశాలపై అనుమానం వచ్చి పాకిస్థాన్‌లోని వివిధ విమానాశ్రయాల్లోనే 66,154 మందిని అధికారులు ‘ఆఫ్‌లోడ్’ చేసి ఇంటికి పంపించారు.

గతంలో 2024లోనే సౌదీ అరేబియా ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. "మీ భిక్షాటకుల వల్ల మాకు తలనొప్పిగా మారింది. కాస్త అదుపులో పెట్టుకోండి" అని తేల్చి చెప్పింది. అయినా తీరు మారకపోవడంతో ఇప్పుడు పాక్ సర్కారే స్వయంగా ఏఐ వీడియోలు, ప్రచారాలతో రంగంలోకి దిగాల్సి వచ్చింది.

సొంత దేశంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైతే... విదేశాలకు వెళ్లి ఇలా 'భిక్షాటన నెట్‌వర్క్‌లు' నడపడం ద్వారా దేశ ప్రతిష్ఠను ప్రపంచస్థాయిలో ముంచేస్తున్నారని విశ్లేషకులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇప్పటికైనా పాక్ పౌరులు ఉమ్రా వీసాను పవిత్ర యాత్రకు మాత్రమే ఉపయోగిస్తారో లేక మళ్లీ డిపోర్ట్ అయి వార్తల్లో నిలుస్తారో చూడాలి.

Tags:    

Similar News