ఏఈ నూకరాజు అల్లుడిది హత్యే.. వెలుగులోకి షూటింగ్ కోచ్ దారుణాలు!

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

Update: 2026-08-18 08:57 GMT

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నూకరాజు కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి వారి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సాధిక్ ఖాన్ పై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు తాజాగా హత్య కేసు నమోదు చేశారు. నూకరాజు వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సాధిక్ ఖాన్ జులై 2న నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా నూకరాజు కుమార్తె సౌజన్య నివసిస్తున్న ఇంట్లో తనిఖీలు చేయగా, ఆమె స్కూటీ డిక్కీలో మూడు లేఖలు లభ్యమయ్యాయని చెబుతున్నారు. నిందితుడు సాధిక్ ఖాన్ తమ కుటుంబాన్ని ఎలా వేధించింది వివరిస్తూ సౌజన్య ఆ లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్ కార్తికేయ రెడ్డితో కలిసి ఆదివారం రాత్రి రోడ్డు కం రైలు బిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. తొలుత నూకరాజు, ఆయన భార్య గోదావరిలో దూకగా, ఆ తర్వాత సౌజన్య, కార్తికేయరెడ్డి గోదావరిలో దూకారు. ఈ ఘటనలో నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఏఈ నూకరాజు మృతదేహం లభ్యమైంది. మీనా, సౌజన్య ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. గోదావరి ఉధృతిలో వారు కొట్టుకుపోయారని చెబుతున్నారు. ఇక తల్లితో పాటే గోదావరిలో దూకిన పదకొండేళ్ల కార్తికేయరెడ్డికి ఈత తెలియడంతో ఈదుకుంటూ ఇసుకతిన్నెలపై చేరుకున్నాడని, రాత్రి సమయంలో జాలర్లు గమనించి పిల్లాడిని రక్షించినట్లు చెబుతున్నారు.

షూటింగ్ కోచ్ దుర్మార్గంతో బలి

పిఠాపురంలోని పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోడానికి కాకినాడకు చెందిన షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ కారణమని సూసైడ్ నోట్ లో ఆరోపించారు. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ ను నూకరాజు వాట్సాప్ లో షేర్ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో తన కుటుంబానికి సహాయం చేస్తానని దగ్గరైన షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ దారుణాలను ఆయన వివరించారని అంటున్నారు. జులై 2న అల్లుడు జగదీష్ రెడ్డి మరణించారని, ఆయనకు వచ్చిన డబ్బు, ఆస్తులు కాజేయడానికి సాధిక్ ఖాన్ ప్రయత్నించినట్లు నూకరాజు ఆరోపించారు. అంతేకాకుండా తన వద్ద ఉన్న డబ్బు, ఆస్తులను కూడా లాక్కున్నాడని, లేదంటే తన మనవడిని చంపేస్తానని బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడని అంటున్నారు.

జగదీష్ రెడ్డిది హత్యే..

గోదావరిలో దూకి ప్రాణాలతో బయటపడిన చిన్నారి కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితుడు సాధిక్ ఖాన్ అంతకుముందు నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డిని మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య వార్తలతో ఆయన వియ్యంకుడు, జగదీష్ రెడ్డి రామచంద్రాపురం నుంచి కాకినాడ వచ్చారు. తన మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడగా, తాతయ్య నూకరాజు, అమ్మమ్మ మీనా, అమ్మ సౌజన్య ఆత్మహత్యలకు కారణాలను ఆయన బయటపెట్టినట్లు చెబుతున్నారు. కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంతో భాస్కరరెడ్డి సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సౌజన్య నివాసం ఉంటున్న ప్లాటులో తనిఖీలు చేశారు. ఆమె ద్విచక్రవాహనంలో మూడు లేఖలు కనుగొన్నారు. ఇందులో సాధిక్ ఖాన్ తమను ఏ విధంగా వేధించింది ఆమె వివరించినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, నూకరాజు కుటుంబం ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న వెంటనే నిందితుడు పరారయ్యాడని అంటున్నారు. రాజమండ్రి, కాకినాడ పోలీసులు అతడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.



Tags:    

Similar News