"వై నాట్ పులివెందుల" - కూటమి గర్జన, జగన్ హై అలర్ట్!
స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఏపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఏపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా గత స్థానిక ఎన్నికల్లో వైట్ వాష్ కు గురైన ప్రస్తుత అధికార కూటమి ఇప్పుడు విపక్షానికి అదే పరిస్థితి తీసుకురావాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా వైనాట్ పులివెందుల అంటూ నినదించడమే కాకుండా, విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గంలో మెజార్టీ సీట్లను గెలుచుకునే వ్యూహంతో పనిచేస్తోందని చెబుతున్నారు. గతంలో జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, వైనాట్ 175, వై నాట్ కుప్పం అంటూ నినాదాలు చేసేవారు. ఇప్పుడు కూటమిలో ముఖ్యనేతలు ఆ విధమైన ప్రకటనలు చేయకపోయినా, పులివెందులలో జగన్మోహనరెడ్డికి ఓటమి రుచి చూపించాలనే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నట్లుగా సంకేతాలు పంపుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఇప్పటివరకు ఆయన కుటుంబానికి ఎదురులేకుండా పోయింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఈ నియోజకవర్గంలో పోటీపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదని చెబుతున్నారు. జగన్మోహనరెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నుంచి పులివెందుల నియోజకవర్గం ఆ కుటుంబానికి కంచుకోటగా ఉండగా, వైఎస్ ఆ తర్వాత జగన్ రెడ్డి చెప్పిన వారికే స్థానిక పదవులు దక్కేవి. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహనరెడ్డి అనుసరించిన విధానాలు కారణంగా ప్రతిపక్ష నేతలకు బలమైన స్థానాల్లో కూడా ఆయా పార్టీలు పోటీ చేసే వాతావరణం లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల్లో అలాంటి వాతావరణం లేకపోయినా ప్రజాస్వామ్యయుతంగానే పోరాడి వైసీపీని ఓడించాలని కూటమి నేతలు వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు.
గత ఏడాది జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ రాలేదు. దీంతో గట్టిగా ప్రయత్నిస్తే పులివెందుల నియోజకవర్గంలో మెజార్టీ నియోజకవర్గాలను కైవసం చేసుకోవచ్చునని టీడీపీ కూటమి ప్లాన్ చేస్తోందని అంటున్నారు. ప్రధానంగా వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేని బలం ఉన్న పులివెందుల నగర పంచాయతీలో పసుపు జెండా ఎగరవేయాలనే వ్యూహంతో టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న కొందరితో చర్చలు సాగిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కూడా స్వయంగా రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు.
జగన్ రెడ్డి ఫోకస్
అధికార పార్టీ ‘వై నాట్ పులివెందుల’ అంటుండటంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అలర్ట్ అయ్యారని చెబుతున్నారు. ప్రతిపక్ష నేతల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న మాజీ సీఎం జగన్ రెడ్డి పార్టీ శ్రేణులు చేయిదాటిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి దిశానిర్దేశం చేశారని అంటున్నారు. అదేసమయంలో ముఖ్యమైన కార్యకర్తలతో జగన్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ అధికార పార్టీ ప్రలోభాలకు లొంగవద్దని, తాను ఉన్నానని భరోసా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇక జగన్ రెడ్డి సూచనలతో ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ ముఖ్యనేతలు నియోజకవర్గంలో పట్టు సడలకుండా పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. దీంతో పులివెందుల రాజకీయం హాట్ హాట్ గా మారిందని చెబుతున్నారు.