చాట్ జీపీటీ, ఏఐని అడిగి హత్యకు ప్లాన్.. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలనం

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుతోపాటు ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు

Update: 2026-10-03 09:47 GMT

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుతోపాటు ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ ను రెండు రోజుల కస్టడీలో విచారించిన పోలీసులు పూర్తి వివరాలను సేకరించారని అంటున్నారు. రెండు రోజుల కస్టడీలో తొలిరోజు తనకు ఏమీ తెలియదని, నేనేమీ చెప్పలేనంటూ అంతా సౌజన్యే చేసిందని చెప్పిన నిందితుడు, రెండో రోజు మాత్రం జగదీశ్వరరెడ్డి హత్యతోపాటు ఏఈ నూకరాజు కుటుంబానికి వేధింపులపై నోరు విప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.

నూకరాజు కుటుంబం ఆస్తులతోపాటు జగదీశ్ రెడ్డి ఆస్తులను దక్కించుకోవాలనే కుట్ర చేసినట్లు నిందితుడు సాదిక్ ఖాన్ అంగీకరించినట్లు పోలీసులను ఉటంకిస్తూ పత్రికలలో వార్తలు ప్రచురితం అయ్యాయి. తన కుట్రలకు పావుగా సౌజన్యను వాడుకున్నట్లు నిందితుడు వాంగ్మూలం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. జగదీష్ రెడ్డిని ఎలా హత్య చేయాలనే విషయమై యూట్యూబ్ లో వీడియోలు వెతికినట్లు నిందితుడు వివరించాడని అంటున్నారు. అంతేకాకుండా చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ సాయంతో సైనేడ్ ఎలా వినియోగించాలి? ఎందులో కలపాలి? థాయ్ పొటాష్ ఎక్కడ దొరుకుతుంది? ఎంత మోతాదులో కలిపి ఇవ్వాలనే విషయాలను నిందితుడు తెలుసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

హైదరాబాదులో తెలిసిన అత్తరు వ్యాపారుల వద్ద విషపదార్థాలను కొనుగోలు చేశానని, వాటిని కొబ్బరి నీళ్లు, ప్రోటీన్ డ్రింక్స్ లో కలిపి ఇచ్చినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జగదీష్ రెడ్డి, ఆయన భార్య సౌజన్య కారులో పిఠాపురం వెళుతుండగా, సౌజన్యకు సాదిక్ ఖాన్ పదే పదే ఫోన్ చేయడం, దీన్ని గమనించిన జగదీష్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు చెబుతున్నారు. జగదీ్ రెడ్డి ఇంటికి తిరిగొచ్చిన సమయంలో వారింటికి వచ్చిన సాదిక్ గొడవపడి అక్కడే ఉన్న చాకుతో జగదీశ్వర రెడ్డిపై దాడి చేసినట్లు పోలీసు విచారణలో అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇక అతడు ఇచ్చిన సమాచారంతో దాడికి ఉపయోగించిన చాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.

నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర్ రెడ్డి హత్య కుట్రలో సాదిక్ పాత్రను తేల్చే ఆధారాలను పోలీసులు సేకరించారు. వాటిని శనివారం న్యాయాధికారి ఎదుట ఉంచనున్నారు. జగదీశ్వరరెడ్డి మరణానికి కొన్ని రోజుల ముందు సాదిక్ ఫోన్ పే, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. వాటిలో ఒకరికి సుమారు రూ.70 వేలు పంపగా, వాటితో విషపదార్థాలు కొన్నట్లు గుర్తించారని అంటున్నారు. సదరు వ్యక్తిని పోలీసులు పిలిచి విచారించారని, సాదిక్ కు విష పదార్థాలు సమకూర్చినట్లుగా వాంగ్మూలం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి నూకరాజు కుటుంబం మరణానికి పూర్తి బాధ్యత సాదిక్ దే అన్న విధంగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News