ప్రేమ కోసం 3,200 కిలోమీటర్ల బైక్ ప్రయాణం.. రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో ఇదే హైలెట్..
| తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రేమకథకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఓ ప్రైవేటు కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. 1990లలో తన ప్రేమను వ్యక్తపరిచేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బైక్‌పై వెళ్లినట్లు వ్యాఖ్యాత ప్రస్తావించగా, ఆయన నవ్వుతూ స్పందించారు. అయితే అది తన వ్యక్తిగత విషయమని సరదాగా వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు.. ప్రత్యర్థులపై విమర్శలతో దూకుడు.. పాలనలో బిజీబిజీగా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జీవితంలో మరో ఆసక్తికరమైన రొమాంటిక్ కోణం కూడా ఉంది. అది ఆయన ప్రేమకథ.. ప్రేమించిన అమ్మాయికి తన మనసులోని మాట చెప్పేందుకు ఏకంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బైక్‌పై ప్రయాణించారట. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఈ పాత ప్రేమ వ్యవహారం ప్రస్తావనకు రావడంతో సీఎం రేవంత్ ముసిముసి నవ్వులు నవ్వడం వైరల్ అయ్యింది. తన ప్రేయసి, ప్రస్తుత సతీమణి గీతకు తన మనసులోని మాట చెప్పేందుకు 1990లలో ఆయన ఏకంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బైక్‌పై ప్రయాణించారన్న విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని మైళ్ల దూరమైనా చిన్నదిగానే కనిపిస్తుంది. మనసుకు నచ్చిన వ్యక్తిని ఒక్కసారి చూడాలనే ఆరాటం ముందు ఎలాంటి కష్టాలైనా కరిగిపోతాయి. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి తన యవ్వన కాలపు సాహసంతో నిరూపించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో వ్యాఖ్యాత ఈ పాత జ్ఞాపకాన్ని సరదాగా గుర్తు చేశారు. పెళ్లికి ముందు గీతపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బైక్ మీద వెళ్లిన సంఘటన గురించి ప్రశ్నించగా నిత్యం గంభీరంగా ఉండే రేవంత్ రెడ్డి ఒక్కసారిగా నవ్వులు చిందించారు. "ప్రేమలో ఉన్నప్పుడు ఎదురుచూపులు ఎంత కష్టంగా ఉంటాయో.. అది ప్రేమించిన వారికే తెలుస్తుంది. అది నా వ్యక్తిగత విషయం.. పబ్లిక్‌కు ఎందుకండి" అంటూ మాట మార్చారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి తిరిగి రావాలంటే దాదాపు 3,200 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది. సాధారణ ప్రయాణాలకే ఎంతో సమయం.. ఓపిక అవసరమయ్యే ఆ రోజుల్లో.. కేవలం తన ప్రేమను గెలిపించుకోవడానికి అంత దూరం ద్విచక్ర వాహనంపై వెళ్లడం నిజంగానే ఒక సినిమాటిక్ సాహసం. ఈ సాహసం వెనుక ఉన్న ఆరాటం గురించి వ్యాఖ్యాత అడిగినప్పుడు.. రేవంత్ రెడ్డి పైవిధంగా ఎంతో హుందాగా, సరదాగా సమాధానమిచ్చి సభలో నవ్వులు పూయించారు.
సాధారణంగా రాజకీయ నాయకులంటే కేవలం ప్రసంగాలు.. విమర్శలు.. విధాన నిర్ణయాలే ప్రజలకు గుర్తుంటాయి. కానీ వారిలోనూ సామాన్యుల లాంటి భావోద్వేగాలు, మధురమైన జ్ఞాపకాలు ఉంటాయని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తన గతాన్ని తలచుకుని ఆయన స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తన వ్యక్తిగత జీవితానికి.. ప్రజా జీవితానికి మధ్య ఉన్న గీతను గౌరవిస్తూనే.. ప్రేమలోని మాధుర్యాన్ని ఒక్క మాటతో ఎంతో అందంగా వర్ణించారు.
రాజకీయ వేడి మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన.. ఫీల్ గుడ్ కబుర్లు వినడం ప్రజలకు ఎంతో కొత్తగా అనిపిస్తోంది. అందుకే 3,200 కిలోమీటర్ల ఈ లవ్ రైడ్ ముచ్చట ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి.. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.