కూటమి ‘ఆపరేషన్ బొత్స’.. సీనియర్ నేతకు ఊహించని దెబ్బ
వైసీపీ సీనియర్ నాయకుడు, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ లక్ష్యంగా కూటమి చేస్తున్న రాజకీయం ఆసక్తి రేపుతోంది.
వైసీపీ సీనియర్ నాయకుడు, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ లక్ష్యంగా కూటమి చేస్తున్న రాజకీయం ఆసక్తి రేపుతోంది. దాదాపు 15 ఏళ్లుగా మంత్రిగా పనిచేయడమే కాకుండా, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బొత్సకు ఊహించని షాక్ ఇచ్చేలా అధికార టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారని అంటున్నారు. వైసీపీని కోలుకోలేని దెబ్బతీయాలంటే ముందుగా బొత్సను రాజకీయంగా నిర్వీర్యం చేయాలని టీడీపీ అగ్రనేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా బొత్స కుటుంబ సభ్యుల నుంచి మొదలుపెట్టి ఆయన అనుచరులు, సన్నిహితులను వైసీపీ నుంచి దూరం చేయాలని పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారని అంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం జిల్లా వైసీపీలో ఎప్పుడు ఏ వికెట్ పడిపోతుందో తెలియని గందరగోళం నెలకుందని చెబుతున్నారు.
విజయనగరం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ప్రత్యర్థిగా నిలబడిన బొత్సను రాజకీయంగా తేరుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని టీడీపీ పెద్దలు ప్లాన్ చేసినట్లుగా ఉందని అంటున్నారు. బొత్సకు నీడగా తిరిగిన ఆయన మేనల్లుడు చిన్న శ్రీనును దూరం చేయడమే కాకుండా, ఆయన ద్వారా విజయనగరం జిల్లాలో బొత్స అనుచరులు అందరినీ వైసీపీ నుంచి బయటకు రప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇందుకోసం రెండు రకాల వ్యూహాలను అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. బొత్సపై తిరుగుబాటు చేసేలా కొందరిని ప్రోత్సహించడంతోపాటు తమతో చేతులు కలిపితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఊరడించడం ద్వారా మరికొందరని టీడీపీ, జనసేనలోకి తెచ్చేలా ప్లాన్ జరుగుతోందని అంటున్నారు.
ఇప్పటికే టీడీపీలో చేరిన జడ్పీ మాజీ చైర్మను చిన్న శ్రీనుకు ఈ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఆయన వైసీపీలో తనకు తెలిసిన వారు అందరితో మాట్లాడుతూ, టీడీపీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశ చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీలో బొత్స నాయకత్వాన్ని ప్రశ్నించేలా మరికొందరిని ఎగదోసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా చిన్న శ్రీనుతో చేతులు కలిపినట్లుగా అనుమానిస్తున్నారు.
ఈ విధంగా మాజీ మంత్రి బొత్స కుటుంబ సభ్యుల ద్వారానే ఆయనను నిలువరించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇన్నాళ్లు బొత్స కోసమే పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేదని, క్షేత్రస్థాయిలో ఒకరు పనిచేస్తే, పదవులు అన్నీ బొత్స ఆయన వారసులు అనుభవిస్తున్నారని ప్రచారం చేయడం ద్వారా ఆయన సన్నిహితులను కూడా ప్రభావితం చేసేలా ప్లాన్ జరుగుతోందని అంటున్నారు. ఈ విషయమై బొత్స అనుచరులు, సన్నిహితులు కూడా ఆలోచనలకు లోనవుతున్నారని అంటున్నారు.
టీడీపీ ప్రచారాన్ని నమ్ముతారా?
ఇక బొత్స లక్ష్యంగా సాగుతున్న ప్రచారంపై ఆయన అనుచరులు, సన్నిహితులు ఎంతవరకు నమ్ముతారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బొత్స అధికారంలో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులే ఎక్కువ పదవులు అనుభవించారని కూటమి ప్రచారం చేస్తుండగా, తాజాగా టీడీపీలో చేరిన జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను కూడా బొత్స బంధువు అన్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు. పార్టీ మారిన తర్వాత చిన్న శ్రీను కూడా బొత్స మాదిరిగా వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వైసీపీలో పరిస్థితులకు, టీడీపీ రాజకీయాలకు మధ్య తేడాలను చూపుతూ ఆపరేషన్ వైసీపీ చేసేలా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి చిన్న శ్రీను ద్వారా ఆపరేషన్ వైసీపీ కాస్త ఆపరేషన్ బొత్సగా మారిందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రలోభాల పర్వంలో ఎక్కువ మంది బొత్స అనుచరులు, సన్నిహితులతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.