ఈసీ యూటర్న్.. విపక్షాల ఆందోళనతో దిగి రాక తప్ప లేదు?
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతోపాటు కొత్త ఓటర్ల చేర్పులపై తీసుకువచ్చిన నిబంధనల విషయంలో ఎన్నికల సంఘం యూటర్న్ తీసుకుంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతోపాటు కొత్త ఓటర్ల చేర్పులపై తీసుకువచ్చిన నిబంధనల విషయంలో ఎన్నికల సంఘం యూటర్న్ తీసుకుంది. కొత్త ఓటర్ల నమోదు కోసం పాత నమూనాలోని ఫారం - 6ని సమర్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా సర్ ప్రక్రియ పూర్తి చేసిన 20 రాష్ట్రాల్లో తొలగించిన ఓట్లు పునఃపరిశీలనకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. సర్ ప్రక్రియ వల్ల లక్షలాదిగా అర్హుల ఓట్లు గల్లంతయ్యాయని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషంగా చెబుతున్నారు. ఈసీ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే సర్ పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. ఓటర్ల జాబితాలో చోటు దక్కని వారిని, కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్లను చేర్చడం దీని లక్ష్యంగా చెబుతున్నారు.
విపక్షాల విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని అంటున్నారు. ఇందులో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో) ప్రస్తుత జాబితాను సర్ కు ముందు ఉన్న ఓటర్ల జాబితాను పోల్చి తొలగించిన ఓట్లను గుర్తించాల్సివుంటుంది. అంతేకాకుండా నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తారు. ఒక్కో బీఎల్వో వారానికి 20 నుంచి 25 మందిని కలిసి, వారి అర్హతలను పరిశీలించాల్సివుంటుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసి తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాలని ఈసీ నిర్ణయించిందని అంటున్నారు. ఇక బీఎల్వోలు సేకరించిన వివరాలను గుర్తింపు పొందిన పార్టీల ఏజెంట్లకు అందజేయాలని ఆదేశించింది. ఈ విధంగా ఓట్ల తొలగింపుపై వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి బయటపడాలని ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
చిచ్చు రాజేసిన ఫారం-6లో మార్పులు
సర్ ప్రక్రియతోపాటు ఓటు నమోదు దరఖాస్తు ఫారం - 6లో చేసిన మార్పుల కారణంగా ఈసీ చుట్టూ వివాదాలు చలరేగాయని చెబుతున్నారు. గత జులైలో ఓటరు నమోదు కోసమంటూ ఆన్‌లైన్ పోర్టల్‌లో కొత్త మార్పులు చేశారు. దీని ప్రకారం, మొదటిసారి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే యువ ఓటర్లు (Gen Z) కేవలం తమ వివరాలే కాకుండా, తల్లిదండ్రులు, తాతముత్తాతలకు ఓటు హక్కు ఉందని నిరూపించాల్సివుంటుంది. అంటే మునుపటి ‘సర్’ ఓటరు జాబితా వివరాలను కూడా సమర్పించాలనే అదనపు డిక్లరేషన్‌ను నిర్బంధం చేశారు. పాత ఓటరు జాబితాలు అందుబాటులో లేకపోవడం, కొత్త ఓటర్ల నమోదు సంక్లిష్టంగా మారడంతో ఈసీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అంతేకాకుండా ఫారం-6లో మార్పులు చేయాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాల్సివుందని చెబుతున్నారు. ఇందుకోసం పార్లమెంటు ఆమోదం పొందాల్సివుందని అంటున్నారు.
పార్లమెంటు ఆమోదం లేకుండా ఫారం - 6లో మార్పులు చేయడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో అధికార పార్టీతో ఈసీ చేతులు కలిపిందని ఆరోపిస్తూ ఆందోళనలకు సిద్ధమైంది. కొత్తగా ఓటు హక్కు సాధించే యువతకు (Gen Z) వారి పూర్వీకుల పాత రికార్డులను తీసుకురావడం కష్టతరంగా మారుతుందని చెబుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. లక్షలాది మంది యువ ఓటర్లను జాబితా నుండి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యూహం పన్నిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు అందరినీ ఆలోచనకు గురిచేశాయని అంటున్నారు. దీంతో ఈసీ దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రుల లేదా తాత ముత్తాతల మునుపటి ఓటరు వివరాలను సమర్పించాల్సిన నిబంధనను సడలించేలా ఈసీ చర్యలు తీసుకుందని అంటున్నారు. పాత సాధారణ పద్ధతిలోనే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే, ఇంకా SIR ప్రక్రియ కొనసాగుతున్న కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతానికి ఈ అదనపు నిబంధన కొనసాగుతుందని తెలిపింది. ప్రస్తుతం సర్ ప్రక్రియ కొనసాగుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు పాత విధానంలోనే ఓటరు దరఖాస్తులు సమర్పిస్తే సరిపోతుందని ఈసీ వెల్లడించింది. మొత్తానికి ఈసీ వర్సెస్ విపక్షాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఎన్నికల సంఘం కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోందని అంటున్నారు.