పోరాట యోధుల కేటగిరీలో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు.. టీడీపీలో వర్ల రామయ్య, రమాదేవి ప్రత్యేకం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత వర్ల రామయ్య, బీసీ మహిళా నేత దళవాయి రమాదేవి ఎంపికయ్యారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత వర్ల రామయ్య, బీసీ మహిళా నేత దళవాయి రమాదేవి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించాలని సిఫార్సు చేస్తూ మంగళవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. రాజకీయ, ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరిని ఎంపిక చేశారని అంటున్నారు. కోస్తా జిల్లాల నుంచి ఎస్సీ కోటాలో వర్ల రామయ్య, రాయలసీమ నుంచి బీసీ, మహిళ కేటగిరీలో దళవాయి రమాదేవి పేర్లను ఎంపిక చేశారని చెబుతున్నా.. ఈ ఇద్దరికి ఒక విషయంలో సారూప్యం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఎమ్మెల్సీల పదవులను పార్టీలో ఎందరో సీనియర్లు ఆశించినప్పటికీ అందరినీ విస్మయానికి గురిచేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. సీనియర్ నేత వర్ల రామయ్య ఎంపిక ఊహించిందే అయినప్పటికీ ఎవరి అంచనాలకు అందని విధంగా బీసీ మహిళా కేటగిరిలో దళవాయి రమాదేవిని ఎంపిక చేయడంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరి ఎంపిక ద్వారా పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. సహజంగా నామినేటెడ్ పదవులు, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఆర్థిక బలం పనిచేస్తుందనే విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, వర్ల రామయ్య, దళవాయి రమాదేవి విషయంలో అటువంటి అభిప్రాయానికే తావివ్వలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీకి అంకితమైన వర్ల రామయ్య
రిటైర్డ్ పోలీసు అధికారి అయిన వర్ల రామయ్య టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాయలసీమలోని అనంతపురంలో నిరుపేద ఎస్సీ కుటుంబంలో పుట్టిన వర్ల రామయ్య కష్టపడి పైకి వచ్చారని చెబుతున్నారు. డిగ్రీ చదువుకున్న ఆయన చాలాకాలం పోలీసు శాఖలో పనిచేశారు. 2009 ఎన్నికల ముందు టీడీపీలో చేరి తిరుపతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగా బలమైన గొంతు వినిపించారు. 2020లో గెలచే అవకాశం లేదని తెలిసి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ ఆదేశాలు శిరసావహిస్తానని చాటుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకున్నా విజయం దక్కలేదు.
2024లో ఆయన కుమారుడు పామర్రు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆర్టీసీ చైర్మనుగాను పనిచేశారు. 2024 ఎన్నికల తర్వాత కూటమి తిరుగులేని ఆధిక్యంతో గెలవడంతో వర్ల రామయ్యకు నామినేటెడ్ పోస్టుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. రాజ్యసభ, శాసనమండలికి ఎప్పుడు ఎన్నిక జరిగినా ఆయన పేరు తెరపైకి వచ్చేది. కానీ, రకరకాల కారణాలతో ఇన్నాళ్లు వెనక్కి వెళ్లిపోయిన వర్ల రామయ్య పేరు ఈ సారి రెండో ఆలోచనకు తావివ్వకుండా ముందు వరుసలో నిల్చొందని అంటున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్లు ఆయన చేసిన త్యాగాలకు గుర్తింపుగా ఆఖరి అవకాశంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కార్పొరేటర్ గా ఓడినా ఎమ్మెల్సీగా గౌరవం
మరోవైపు వర్ల రామయ్యతోపాటు ఎమ్మెల్సీగా ఎంపికైన దళవాయి రమాదేవి చరిత్ర కూడా ఆసక్తి రేపుతోంది. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న రమాదేవి ఎంపిక ద్వారా పార్టీ కోసం కష్టపడిన వారికి ఇలాంటి గుర్తింపు ఉంటుందని టీడీపీ అధిష్టానం సంకేతాలు పంపిందని అంటున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం కార్పొరేషన్ లో 47వ డివిజన్ కార్పొరేటర్ గా రమాదేవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ కోసం అంకితభావంతో కష్టపడి పనిచేశారని అంటున్నారు. అనంతపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో అంగన్ వాడీ విభాగం అధ్యక్షురాలిగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో సుమారు 6 కేసులు ఎదుర్కొన్న ఆమె పార్టీ తరఫున రాజీ లేకుండా పోరాడారని చెబుతున్నారు. దీనికి గుర్తింపుగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ చెప్పినట్లుగా బూత్ స్థాయిలో పనిచేసినప్పటికీ పార్టీ గుర్తిస్తుందని రమాదేవి ఎంపిక నిరూపించిందని వ్యాఖ్యానిస్తున్నారు.