రూ.2000 నోట్లు మాయం.. రూ.500 నోట్ ప్లాస్టిక్ కరెన్సీ వస్తోందా! అసలేం జరుగుతోంది?
తాజా అప్ డేట్ ప్రకారం.. కేంద్రంలో ప్లాస్టిక్ కరెన్సీని దఫదఫాలుగా చెలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నం సాగుతోందనే కథనాలొస్తున్నాయి.
రూ.2000 నోట్లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.. దఫదఫాలుగా బ్యాంకుల నుంచి వాటన్నిటినీ ఆర్.బి.ఎ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ప్లాస్టిక్ నోట్లు ఇతర నోట్లన్నిటినీ రీప్లేస్ చేయబోతున్నాయనే వార్తలు కల్లోలం రేపుతున్నాయి. సహజంగానే గోడలు, బాత్రూమ్‌లు, బెడ్ రూమ్ బెడ్ కింద నోట్ల కట్టలు దాచుకునేవాళ్లంతా ఇప్పుడు ఆ నోట్లను మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే సందేహం కలగక మానదు. ప్లాస్టిక్ నోట్‌ల భయంతో 500 నోట్లు మార్చేందుకు ట్రై చేస్తున్నారా? అనే సందేహం కూడా మొదలైంది... పూర్తి వివరాల్లోకి వెళితే.....
రూ. 2000 నోట్ల మాయమవుతున్న జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా మరువకముందే, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న సరికొత్త నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా మార్కెట్లో చెలామణిలో ఉండే కాగితపు కరెన్సీకి ప్రత్యామ్నాయంగా.. తొలి విడతగా రూ. 10, రూ. 20 విలువైన ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను ప్రయోగాత్మకంగా ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వార్త బయటికి రాగానే సామాన్య ప్రజల్లో ఓ వైపు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంటే.. మరోవైపు అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని గోడలు, బాత్రూమ్‌లు, బెడ్‌రూమ్‌ల మంచాల కింద మూటగట్టి దాచుకునే కేటుగాళ్ల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి.
గతంలో వచ్చిన పెద్ద నోట్ల రద్దు సమయంలో ఎదురైన చేదు అనుభవాలు.. తలెత్తిన పరిణామాలు అందరికీ ఇంకా గుర్తే. సరిగ్గా అదే కోవలో ఇప్పుడు రాబోతున్న ఈ ప్లాస్టిక్ కరెన్సీ రూపంలో మరోసారి నల్లధన గుత్తేధారులకు పెద్ద ఎత్తున పొగ పెట్టబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రూ. 2000 నోట్లను ఆర్బీఐ దఫదఫాలుగా వెనక్కి తీసుకోవడంతో పెద్ద మొత్తంలో సొమ్మును దాచుకున్న వారికి పెద్ద షాకే తగిలింది. ఇటీవల ఏకంగా ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయనే పుకార్లు, వార్తలు కలకలం రేపుతుండటంతో.. భవిష్యత్తులో ఎక్కడ తమ వద్ద కుట్టలుగా పడి ఉన్న రూ. 500 నోట్లు సహా ఇతర పెద్ద నోట్లను కూడా మార్చాల్సి వస్తుందోననే భయం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందనే ఊహాగానాలు సాగుతున్నాయి.
ఈ ఆందోళనతోనే రహస్యంగా కూడబెట్టిన సంపదను బయటికి తీసి హడావుడిగా మార్చుకునేందుకు లేదా దాన్ని ఇతర రూపాల్లోకి మళ్లించేందుకు కొందరు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఆర్బీఐ చేపడుతున్న ఈ ప్లాస్టిక్ నోట్ల ప్రయోగం కేవలం కరెన్సీ జీవిత కాలాన్ని పెంచడానికి.. నకిలీ నోట్లను అరికట్టడానికి మాత్రమే. దీనివల్ల ప్రస్తుతానికి ఏ కాగితపు నోట్లు రద్దు కావడం లేదని, పాత నోట్లన్నీ యథావిధిగా చలామణిలో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్ లో సాంకేతికత మారుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందనే భయంతో అక్రమార్కుల్లో మాత్రం టెన్షన్ మొదలైందనే విశ్లేషణలు సాగుతున్నాయి.
తాజా అప్ డేట్ ప్రకారం.. కేంద్రంలో ప్లాస్టిక్ కరెన్సీని దఫదఫాలుగా చెలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నం సాగుతోందనే కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా తొలిగా రూ.10, రూ.20 నోట్లపై ప్రయోగం మొదలైంది. దీని తర్వాత 100 నోట్లు, 500 నోట్ల స్థానంలో మార్పిడి ఉండొచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీని అర్థం కాగితం నోట్లు చెలామణిలో ఉండవని కాదు....! అని బ్యాంకులు చెబుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడే కాగితం నోట్లు మాయమవ్వవు. కానీ దఫదఫాలుగా మాయమవుతాయా? అనేదే ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్.. అయితే దీనిపై బ్యాంకులు అధికారిక ప్రకటనల ద్వారా మరింత విశ్లేషణాత్మకంగా స్పష్ఠతనివ్వాల్సి ఉంటుంది.