వైసీపీ పాట్లు: కారుమూరికి కస్టడీ.. అంబటికి నోటీసులు!
వైసీపీ తీవ్ర ఇరకాటంలో పడుతోంది. `ఒక్కక్కరు కాదు షేర్ ఖాన్` అన్నట్టుగా వైసీపీలోని నేతలకు కేసులు చుట్టుముడుతున్నాయి.
వైసీపీ తీవ్ర ఇరకాటంలో పడుతోంది. `ఒక్కక్కరు కాదు షేర్ ఖాన్` అన్నట్టుగా వైసీపీలోని నేతలకు కేసులు చుట్టుముడుతున్నాయి. ఒక్కరైతే.. సరే అనుకోవచ్చు. కానీ, రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం, నాయకుల చుట్టూ ఉచ్చు బిగిస్తుండడంతో వైసీపీ కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో రాజకీయం, అనుచరుల హవా వంటివి పూర్తిస్థాయిలో నిస్తేజమయ్యాయి. నిజానికి ఇప్పటికే జిల్లాల్లో వైసీపీ రాజకీయాలు 60 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. నాయకులు బయటకు రావడం లేదు. వచ్చిన వారు కూడా ఏదో తూతూ మంత్రం అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు కేసులకు భయపడుతున్నవారు గడప కూడా దాటడం లేదు.
తాజాగా ఇద్దరు కీలక నాయకులకు మరో ఉచ్చు బిగిసింది. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం కేసులో రెండో అంకంగా ఉన్న లిక్కర్ బాటిళ్ల రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కూడా చెంచల్ గూడ జైల్లో ఉన్నారు.. ఈ కుంభకోణంలో 35 కోట్ల మేరకు వారు పోగేసుకున్నారన్నది ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్న మాట. దీనిపై విచారణ కూడా సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా కారుమూరిని మరింత లోతుగా విచారించాలని కోరడంతో కోర్టు ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల కస్టడీకి అప్పగిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది.
తాజాగా సోమవారం అధికారులు హైదరాబాద్‌లోని చెంచల్‌గూడ జైలులో ఉన్న కారుమూరిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం కేసుల(బాటిళ్ల బాక్సులు) రవాణా వ్యవహారంలో సబ్ కాంట్రాక్టును తన కుమారుడు సునీల్‌కు ఇప్పించడంలో కారుమూరి కీలక పాత్ర పోషించారని ఈ కేసును విచారిస్తున్న ఈడీ అధికారులు నమోదు చేశారు. అంతేకాదు.. దండుకున్న సొమ్మును తమ కార్యాలయాల ఏర్పాటు, బ్యాంకులో ఖాతాల నిర్వహణకు కూడా వినియెగించినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో కారుమూరి కోడలు పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. ఆమె గురించి కూడా విచారణ చేసేందుకు, నిధుల దారిమళ్లింపును తెలుసుకునేందుకు కారుమూరిని కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం 4 రోజలు పాటు ఆయనను ప్రత్యక్షంగా విచారించనున్నారు.
అంబటికి ఉచ్చు..
వైసీపీ మరో నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కూడా పోలీసులు తాజాగా నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆయనను ఆదేశించారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత.. ఆయన ఇంటి వద్ద అంత్యక్రియలు చేసే క్రమంలో పోలీసులపై అంబటి దాడి చేశారని.. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీని విచారణలో భాగంగానే అంబటికి తాజాగా నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆయన తనకు ఇప్పటికిప్పుడు వచ్చేందుకు వీల్లేదని.. త్వరలోనే వచ్చే తేదీని చెబుతానని పేర్కొన్నారు. కాగా. ఈ నోటీసులను రాజకీయ కుట్రగా అంబటి పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులను ఇలా నిర్బంధించే ప్రక్రియ చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు.