లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆ ముగ్గురు జర్నలిస్టులు ఎవరు?
వివేక్ భగత్ తనను అసభ్యంగా తాకుతూ వెనక్కి నెట్టేసినట్లుగా ఒక మహిళా జర్నలిస్టు కంప్లైంట చేశారు.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి.. హ్యాట్రిక్ ప్రధానిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి గతానికి భిన్నంగా తరచూ నిరసనలు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూ చూస్తుండగానే చిలికి చిలికి గాలివానలా మారి.. తొలిసారి ప్రజాహాగ్రహానికి.. విపక్ష నిరసనలకు తలొగ్గి వేటు వేసిన అరుదైన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. తాజాగా సర్ వివాదంలో ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నిరసనలు మొదలు కావటం.. దీనికి కాక్రోచ్ పార్టీ నాయకత్వం వహించటం తెలిసిందే.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనల వేళ.. అనూహ్యమైన వివాదం ఒకటి తెర మీదకు వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిరసనల్ని కవర్ చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళా జర్నలిస్టులకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని.. అదంతా కూడా పోలీసులే చేశారన్న షాకింగ్ ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. నిరసన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న వేళ మహిళా పోలీసులు లేరన్న విషయాన్ని ప్రశ్నించినందుకు ఢిల్లీ పోలీస్ తనను అసభ్యంగా తాకుతూ వెనక్కి నెట్టేసినట్లుగా ఒక మహిళా జర్నలిస్టు కంప్లైంట చేశారు. ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత మరో ఇద్దరు మహిళా జర్నలిస్టులు సైతం తమపై లైంగిక వేధింపులు జరిగినట్లుగా ఆరోపించటం సంచలనంగా మారింది.
నిజానికి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం చేపట్టిన నిరసనల్లో అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా.. మహిళా జర్నలిస్టులను పోలీసులు లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణ ఎక్కువగా ఫోకస్ అయ్యింది. ఇలాంటి వేళ.. ఇంతకూ ఆరోపణలు చేసిన ఆ ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఎవరు? వారు ఏ మీడియా సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? అన్న ప్రాథమిక ప్రశ్న తెర మీదకు వస్తుంది. వ్యక్తిగతా గోపత్యలో భాగంగా ఈ వివరాల్నిబయటకు వెల్లడించటం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సదరు ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఇండిపెండెంట్ జర్నలిస్టుగా చెబుతున్నారు.
ఈ విషయం వెలుగు చూసిన తర్వాత నుంచి కొత్త ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. సింపతీ కార్డు వాడుతున్నారా? కావాలనే నిరసనల తీవ్రతను పెంచేందుకే ఈ కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మహిళా జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదులపై నిష్పక్షపాత దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు ఈ కేసును క్రైం బ్రాంచ్ కు బదిలీ చేశారు. కాకుంటే ఇక్కడ తెర మీదకు వచ్చే ప్రశ్న ఏమంటే.. వాస్తవం ఏమిటి? అన్న దానిపై స్పష్టత లేదు. ఎలా అయితే మహిళా జర్నలిస్టుల గోప్యత అవసరమో.. పోలీసు అధికారి పేరుతో జరుగుతున్న ప్రచారం ఆయన కుటుంబానికి కొత్త సమస్యలు ఎదురుకావా? ఆయన కుటుంబానికి పరువు మర్యాదలకు ఎదురయ్యే ఇబ్బందుల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అన్నది మరో ప్రశ్న.
ఇప్పటికైతే ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే. నేరం రుజువు కాలేదు. కానీ.. సదరు పోలీసు అధికారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా సాగుతున్న ప్రచారంలో.. రేపొద్దున నేరం చేశారన్నప్పుడు తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఒకవేళ.. ఆరోపణలు తప్పని తేలితే.. ఫిర్యాదుదారులపై చర్యలు సదరు అధికారికి జరిగిన నష్టాన్ని ఎంతమాత్రం భర్తీ చేయలేవు. అందుకే.. అధికారిపై అదే పనిగా ఆరోపణలకు ఎక్కువప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదులతో పాటు.. ఏవైనా ఆధారాల్నిసమర్పించారా? అంటే కొన్ని వీడియోలను అందించినట్లు చెబుతున్నారు. కాకుంటే.. ఈ ఆధారాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముగ్గురు ఇండిపెండెంట్ జర్నలిస్టులపై లైంగికవేధింపులకు పాల్పడితే.. అక్కడే ఉన్న ప్రధాన మీడియాకు చెందిన మహిళా జర్నలిస్టులు చూస్తూ ఊరుకోరుకదా? పెద్ద ఎత్తున ప్రశ్నిస్తారు కదా? తాజా ఉదంతంలో అలాంటివేమీ ఎందుకు చోటు చేసుకోలేదన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఏమైనా.. తప్పు చేసిన వారుతప్పించు కోకూడదు. అదేసమయంలో నేరారోపణ జరగకముందే.. తీర్పులు ఇచ్చేయటం సరికాదు. అది ఢిల్లీ పోలీస్ విషయంలో అయినా.. మహిళా జర్నలిస్టుల విషయంలో అయినా. ఇప్పటికైతే ఇద్దరిలో తప్పు ఎవరిది? తప్పు ఎవరు చేశారన్న దానికి ప్రాధాన్యత ఇచ్చే కన్నా..ఇరువురిని ఒకేలా చూడటం సరైనదన్న మాట వినిపిస్తోంది. ఈ వివాదంలో అసలేం జరిగిందన్న నిజం బయటకు రావాల్సి ఉంది. అప్పుడే.. ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తే మంచిది. మరి.. మీరేమంటారు?