గుండకు మేయర్ టికెట్...గొండు సహకరిస్తేనే సక్సెస్ !
శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ కి ఈసారి ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ కి ఈసారి ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. 2005లో మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. 2010లో ఆ పాలన వర్గం గడువు ముగిసింది. అది లగాయితూ గత పదహారేళ్ళుగా ఎన్నికలు అంటే లేవు. మరో వైపు మునిసిపాలిటీ కార్పోరేషన్ గా ఎదిగింది. కానీ కౌన్సిలర్ నుంచి కార్పోరేటర్ గా పదోన్నతి పొంది ఆ అధికార వైభోగం అనుభవించే చాన్స్ రాజకీయ జీవులు ఎవరికీ రావడం లేదు. చాలా మంది ఆశావహులు మేయర్ సీటుని చూస్తూనే తనువు చాలించారు. వాయిదాల పర్వంలో ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర ఉన్న శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఎన్నికలు ఇక ఆపకూడదని కూటమి భావిస్తోంది. దాంతో స్థానిక ఎన్నికలు జరిగే అన్ని కార్పోరేషన్లతో పాటు శ్రీకాకుళానికి కూడా కలిపి నిర్వహించాలని చూస్తోంది.
మాజీ ఎమ్మెల్యేకు హామీ :
ఇక శ్రీకాకుళం తొలి మేయర్ తామే తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇక్కడ మిత్రుల నుంచి పెద్దగా పోటీ లేకపోవడం టీడీపీకి కలిసి వచ్చే అంశం. మరో వైపు చూస్తే టీడీపీకి శ్రీకాకుళం నగర పరిధిలో బలమైన నేతలు ఉన్నారు. ముఖ్యంగా దివంగత గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి మంచి పట్టు ఉంది. గతంలో ఎన్నికలు జరిగితే ఆయనే మేయర్ గా పోటీ చేయాలని అనుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన మరణించారు. ఇపుడు ఆయన సతీమణి, 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన గుండ లక్ష్మీదేవి ఈ పదవి కోసం చూస్తున్నారు. న్యాయంగా ఆమెకే ఈ పదవి ఇవ్వాలని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఆమెకు ఇవ్వలేదు. ఆనాడే ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఇస్తామని అధినాయకత్వం హామీ ఇచ్చింది. దాంతో ఇటీవల టీడీపీ అధినాయకత్వాన్ని గుండ లక్ష్మీదేవి కలసి వచ్చారు అని అంటున్నారు. ఆమెకు హైకమాండ్ హామీ ఇచ్చిందని చెబుతున్నారు.
ఎమ్మెల్యే గొండు వర్గంతోనే :
అయితే గుండ లక్ష్మీదేవికి సొంతంగా బలం ఉంది. పార్టీ బలం కూడ తోడు అయితే కచ్చితంగా శ్రీకాకుళం తొలి మేయర్ పీఠం టీడీపీకే దక్కుతుంది. కానీ శ్రీకాకుళం నగరంలో టీడీపీలో రాజకీయ సమీకరణలలో కొంత తేడా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ కి అలాగే మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వర్గానికి మధ్య అంతరం ఉందని ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో లక్ష్మీదేవికి దక్కాల్సిన టికెట్ చివరి నిముషంలో అనూహ్యంగా రంగంలోకి వచ్చి విజయం దక్కించుకున్నారు. అది కూడా దిగ్గజ నేత అప్పటి రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీద 51 వేల ఓట్ల భారీ తేడాతో గెలిచిన సంచలనం సృష్టించారు. ఆయనకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని అంటారు. ఇక 2024 ఎన్నికల నుంచి గుండా వర్గం, గోండు వర్గంగానే శ్రీకాకుళం రాజకీయాలు సాగుతున్నారు. దాంతో గుండ లక్ష్మీదేవికి మేయర్ టికెట్ ఇస్తే ఎమ్మెల్యే వర్గం ఎలా రియాక్ట్ అవుతుందని అంతా ఆసక్తిగా చర్చిస్తున్నారు.
రేసులో పలువురు :
ఇదిలా ఉంటే మేయర్ పదవి కోసం రేసులో పలువురు ఉన్నారు. వీరిలో కొందరిని ఎమ్మెల్యే వర్గీయులే ప్రోత్సహిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇక గుండ లక్ష్మీదేవికి కనుక మేయర్ చాన్స్ ఇస్తే ఆమె కచ్చితంగా రాజకీయంగా బలపడతారని అపుడు తమకు ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే వర్గం ఆలోచిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కనుక కలిసికట్టుగా ముందుకు సాగితే మాత్రం మేయర్ సీటుని టీడీపీ బంపర్ మెజారిటీతో గెలుచుకుంటుంది. టీడీపీ హైకమాండ్ దిశా నిర్దేశం చేస్తుంది కాబట్టి కచ్చితంగా అంతా కలిసి పనిచేస్తారనే అంటున్నారు. ఒక వేళ అలా కనుక జరగకపోతే మాత్రం వైసీపీకి ఇక్కడ అనుకోని వరంగా ఎన్నికలు మారే సీన్ ఉంటుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.