ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం..! ఆ రహస్యం దాచినందుకే..

1940ల కాలంలో భారత విభజన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పాకిస్థాన్ రూపశిల్పి మహ్మద్ అలీ జిన్నా తీవ్రమైన క్షయ వ్యాధి (టీబీ) తో బాధపడుతున్నారు.

Update: 2026-08-18 13:30 GMT

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఎప్పుడూ ఉద్రిక్తతలు, రాజకీయ విమర్శలు, సైనిక మోహరింపులే వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే సుమారు ఎనిమిది దశాబ్దాల నాటి ఒక అరుదైన చారిత్రక ఘట్టం, వృత్తిపరమైన నిబద్ధత ప్రాతిపదికన భారత్‌కు చెందిన ఇద్దరు దివంగత పార్శీ వైద్యులకు పాకిస్థాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్‌-ఎ-ఇంతియాజ్‌’ను ప్రకటించింది. ఆ ఇద్దరు వైద్యులు బొంబాయికి చెందిన ఫిజిషియన్ డాక్టర్ జల్ రతన్ జీ పటేల్, రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ ధేభో కూ.

ఆ రహస్యం ఏమిటి? విభజనపై దాని ప్రభావం ఎంత?

1940ల కాలంలో భారత విభజన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పాకిస్థాన్ రూపశిల్పి మహ్మద్ అలీ జిన్నా తీవ్రమైన క్షయ వ్యాధి (టీబీ) తో బాధపడుతున్నారు. ఆ సమయంలో బొంబాయిలో జిన్నాకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ జల్ రతన్ జీ పటేల్, డాక్టర్ జల్ ధేభో కూల ఎక్స్-రే నివేదికల్లో ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. ఆయన ఆయుష్షు మరో ఏడెనిమిది నెలలు లేదా మహా అయితే ఏడాది-రెండేళ్లు మాత్రమేనని స్పష్టమైంది.అయితే, వైద్య వృత్తి నైతిక నియమావళి ప్రకారం రోగి ఆరోగ్య వివరాలను గోప్యంగా ఉంచాలన్న జిన్నా అభ్యర్థనకు ఆ వైద్యులు కట్టుబడ్డారు. జిన్నా ఆరోగ్య పరిస్థితిని బ్రిటిష్ అధికారులకు గానీ, నాటి కాంగ్రెస్ నాయకులైన మహాత్మా గాంధీ, జవాహర్‌లాల్ నెహ్రూలకు గానీ తెలియకుండా అత్యంత గోప్యంగా ఉంచారు.

ప్రసిద్ధ చరిత్రకారులు లారీ కాలిన్స్, డొమినిక్ లాపియర్ తమ ప్రతిష్టాత్మక పుస్తకం ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ లో రాసిన దాని ప్రకారం.. అప్పటి చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్‌కు జిన్నా మరణిస్తారనే స్థితిలో ఉన్నారనే విషయం ముందే తెలిసి ఉంటే, విభజన ప్రక్రియను కొద్ది నెలలు వాయిదా వేసేవారని, ఫలితంగా అసలు పాకిస్థాన్ ఏర్పాటే అయ్యేది కాదని పేర్కొన్నారు.

పాకిస్థాన్ ప్రభుత్వ గుర్తింపు

1947 ఆగస్టులో దేశ విభజన జరగగా దానికి సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1948 సెప్టెంబర్ 11న జిన్నా మరణించారు. ఈ చారిత్రక ఘట్టం జరిగి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్న వేళ, పాకిస్థాన్ ప్రణాళికా రహిత అభివృద్ధి శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ ఈ ఇద్దరు భారతీయ వైద్యుల నిబద్ధతను గుర్తించింది. "వృత్తిధర్మానికి కట్టుబడి వారు దాచిన ఆ రహస్యమే పాకిస్థాన్ అవతరణకు అత్యంత కీలకమైన వాతావరణాన్ని కల్పించింది" అని పేర్కొంటూ, మరణానంతరం వారికి ‘నిషాన్‌-ఎ-ఇంతియాజ్‌’ పురస్కారాన్ని ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.

రాజకీయ సరిహద్దులు.. యుద్ధ వాతావరణం.. విభేదాలను పక్కన పెడితే.. వృత్తిపరమైన నిబద్ధతకు, వైద్య రంగ నైతికతకు ఇచ్చే గౌరవంగా ఈ ఘటన చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

Tags:    

Similar News