ఏపీ లో థర్డ్ ఫ్రెంట్: వ్యూహాలకు పదును.. !
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ వ్యూహాలు మారుతున్నాయా? ముఖ్యంగా చిన్న చితకా పార్టీలు చేతులు కలపనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల నాటి కి రాష్ట్రంలో రాజకీయ వ్యూహాలు మారుతున్నాయా? ముఖ్యంగా చిన్న చితకా పార్టీలు చేతులు కలపనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా జోరుగా సాగు తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు పార్టీలైన టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో నూ ఈ మూడు పార్టీలు బలమైన పోటీ ఇవ్వనున్నాయి. ఇక, వైసీపీ ఒంటరి పోరువైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి గత కొన్నాళ్లుగా వైసీపీతో చెలిమికి కొన్ని పార్టీలు మొగ్గు చూపాయి.
ముఖ్యంగా కమ్యూనిస్టులు, జై భారత్ భీం పార్టీ వంటివి వైసీపీతో కలిసి ముందుకు సాగాలని అనుకున్నాయి. కానీ, ఆ అవకాశం వైసీపీ ఇవ్వట్లేదని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. ఆ పార్టీతో జట్టు కట్టాలని అనుకున్నా.. అసలు ఎక్కడా పార్టీ పరిస్తితి పడ్డ చోట నుంచి లేచే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరూ తొంగి చూడడం లేదు. దీంతో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుపై పార్టీలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా ఇటీవల తిరుపతి, విజయవాడల్లో సమావేశాలు జరగడం గమనార్హం.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. కమ్యూనిస్టులు కలివిడిగా ముందుకు సాగడంతోపాటు.. మాజీ ఐపీఎస్ వెంక టేశ్వరరావు పెట్టబోయే(?) పార్టీ సహా.. ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ, జైభారత్ భీం సహా.. మరికొన్ని పార్టీలు చేతులు కలిపేందుకు రెడీ అయ్యాయి. ఇదే విషయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు వెల్లడించడం గమనార్హం. అలానే మాజీ ఐపీఎస్ వెంకటేశ్వరరావు కూడా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
ఎవరికి ఇబ్బంది.. ?
తృతీయ ఫ్రంట్ కనుక రంగంలోకి దిగితే.. ప్రధానంగా వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. సహజంగానే ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోయి.. ఈ తృతీయ పక్షం పార్టీలకు పడే అవకాశం ఉందని.. తెలుస్తోంది. నియోజకవర్గానికి 5 నుంచి 10 వేల ఓట్ల మధ్యలో చీలిపోయినా.. అది కూటమి పార్టీలకు మేలు చేస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీకి పెద్ద ప్రమాదం తప్పదన్న లెక్కలు వస్తున్నాయి. ఇక, కూటమి విషయాని కి వస్తే.. వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోతే..మరోసారి కూటమి అధికారంలోకి రావడం తధ్యం. ఇక, అధికారమే పరమావధిగా తృతీయ కూటమి ఏర్పడుతున్నా.. అది సాధ్యం కాకపోవచ్చు.