20 మార్కులకే టీచర్ ఉద్యోగం.. ఆఫర్ బాగుందని అనుకుంటున్నారా?

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రాత్రింబవళ్లు కష్టపడాలి, వందల మార్కులు సాధించాలి.. ఎంతలా కష్టపడినా అదృష్ట దేవత కూడా వరించాలి;

Update: 2026-02-17 14:30 GMT

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రాత్రింబవళ్లు కష్టపడాలి, వందల మార్కులు సాధించాలి.. ఎంతలా కష్టపడినా అదృష్ట దేవత కూడా వరించాలి. అందుకోసం పూజలు, వ్రతాలు కూడా చాలా మంది చేస్తుంటారు. ఈ బాధలేవీ లేకుండా ఉద్యోగాలు రావా? అంటే చెప్పడం చాలా కష్టమే. కొన్నిసార్లు ఉద్యోగం కోసం ఎంతలా కష్టపడి చదివినా, ఒకటి అరా మార్కులు చాలక చాన్స్ కోల్పోయిన ఉదంతాలు మన కళ్ల ముందు చాలానే జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిశాలో కేవలం 20 మార్కులకే టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 150 మార్కులకు జరిగిన పరీక్షల్లో కొందరు 20 మార్కులు తెచ్చుకుని దర్జాగా టీచర్ కొలువుల్లో జాయిన్ అయిపోయారు. ఇదే సమయంలో అదే పరీక్ష రాసిన కొందరు 80-90 మార్కులు తెచ్చుకున్నా ఉద్యోగాలకు ఎంపిక కాలేదు. దీంతో ఈ మార్కుల జాబితాలు ఆన్ లైన్ వేదికగా హాట్ డిబేట్ కు తెరతీశాయి.

ఒడిశాలో 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి 2023లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత పరీక్ష నిర్వహించారు. జిల్లా వారీగా మెరిట్ లిస్టులు ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో రిజర్వుడు కేటగిరీ కింద కేవలం 20 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి. అదే సమయంలో జనరల్ కేటగిరీలో 122కి పైగా మార్కులు తెచ్చుకోవాల్సివచ్చింది. బీసీలు సైతం 121 మార్కులు సాధిస్తే కానీ ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోయారు. కానీ, ఎస్టీ రిజర్వుడు కింద కేవలం 20 మార్కులు వచ్చినా టీచర్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఒకే ఉద్యోగానికి ఇంత భారీ వ్యత్యాసంతో ఉద్యోగాలను భర్తీ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

నిజానికి ఉద్యోగాల నియామకాలకు కటాఫ్ మార్కులు నిర్దేశిస్తే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అంటున్నారు. మినిమం మార్కులు తెచ్చుకోని వారు ఉపాధ్యాయులై పిల్లలకు ఎలాంటి పాఠాలు చెబుతారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులుగా ఉద్యోగాల్లో చేరేవారికి కనీస సామర్థ్యం ఉండాలి కదా అంటూ వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే, నిబంధనల ప్రకారం మెరిట్ లిస్టు తయారు చేశామని, ఆ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసినట్లు చెబుతున్నారు.

విచారణ చేపట్టిన హైకోర్టు, గతంలో ప్రకటించిన మెరిట్ లిస్ట్‌ను తప్పుబడుతూ, పారదర్శకంగా కొత్త జాబితా రూపొందించాలని ఆదేశించింది. అయినప్పటికి గిరిజన జనాభా అధికంగా ఉన్న వెనుకబడిన జిల్లాలు మల్కన్ గిరి, కొరాపుట్, నవరంగపూర్ జిల్లాల్లో తగినంత మంది అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో తక్కువ మార్కులు వచ్చినా రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సివచ్చిందని అంటున్నారు. ఒకే రాష్ట్రంలో ఒక జిల్లాలో 100 మార్కులు వచ్చినా ఉద్యోగం రాని పరిస్థితి ఉండగా, మరో జిల్లాలో 20 మార్కులకే ఉద్యోగం రావడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ ఆధ్వర్యంలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి తొలి ఏడాది రూ.16 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. ఇలా మూడేళ్లు పనిచేసిన తర్వాత మరో మూడేళ్లు జూనియర్ టీచర్ గా సేవలు అందించాల్సివుంటుంది. ఈ కాలంలో జీతం స్వల్పంగా పెరుగుతుంది. ఇక 6 ఏళ్ల తర్వాత వీరికి రెగ్యులర్ చేస్తారు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించినట్లే జీతం ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News