కర్ణాటకలో కుర్చీలాట.. ఆస్ట్రేలియాకు కొందరు, గోవాకు మరికొందరు.. ట్విస్టులే ట్విస్టులు
కన్నడ రాజకీయం మళ్లీ రసకందాయంగా మారింది. గత కొద్దికాలంగా నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్యేల విదేశీ పర్యటన తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది.;
కన్నడ రాజకీయం మళ్లీ రసకందాయంగా మారింది. గత కొద్దికాలంగా నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్యేల విదేశీ పర్యటన తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతుండగా, వారికి పోటీగా మరికొందరు పక్కనే ఉన్న గోవా ట్రిప్ కు రెడీ అవుతున్నారనే ప్రచారం కర్ణాటక కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. ఈ పర్యటనలు, ప్రచారాలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినట్లు చెబుతున్నారు. మరోవైపు తాజా పరిణామాలపై ఇరువర్గాల నేతలు విమర్శలు, ప్రతివిమర్శలతో రచ్చకెక్కుతున్నారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వర్గాల మధ్య పోరుకు ఎండ్ కార్డు పడటం లేదు. ఈ వ్యవహారంపై ఏదీ తేల్చకుండా కాంగ్రెస్ అధిష్టానం కూడా నాన్చుతుండటంతో ఇరువర్గాలు సీఎం పీఠంపై ఆశతో తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చనున్నారని, ఆయన ప్లేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని డీకే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల బహిరంగంగా చేసిన ప్రకటనలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు రచ్చకు కారణమయ్యాయి. అదే సమయంలో సీఎం పదవి కోరుకుంటే తప్పేంటి? అంటూ డిప్యూటీ సీఎం డీకే చేసిన వ్యాఖ్యలు రాజకీయాన్ని మరింత వేడెక్కించాయి.
ఈ పరిస్థితుల్లో సీఎం సిద్ధ రామయ్య వర్గానికి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి ఆస్ట్రేలియా పయనమవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. వీరంతా రాష్ట్ర పశుసంవర్థక మంత్రి వెంకటేశ్ నేతృత్వంలో ఆ శాఖపై అవగాహన పెంచుకోడానికి ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే నాయకత్వ మార్పుపై ప్రచారం జరుగుతున్న వేళ సిద్ధూ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్లడమే అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియా వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం వర్గంతో విదేశాలకు వెళ్లడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న ఆలోచనతో కొందరు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలు చూపి కొందరు, అనుమతి రాలేదంటూ మరికొందరు విదేశీ పర్యటనకు వెళ్లడం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్ వర్గం 40 మంది ఎమ్మెల్యేలను గోవా ట్రిప్ కు తీసుకువెళుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో కర్ణాటకలో ఏం జరుగుతుందనేది ఆసక్తి చర్చగా మారింది.
మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం వర్గాలకు దూరంగా తటస్థంగా ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు తాజా పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ సమర్థులే అని, సర్కారును నడిపే డబుల్ ఇంజన్లుగా వారిని చూడాలని అంటున్నారు. లేనిపోని అపోహలకు తావివ్వడం వల్ల ప్రభుత్వం చెడ్డపేరు తెచ్చుకుంటోందని తటస్థ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో గ్రూప్ వార్ పై విపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఖజానాలో చిల్లిగవ్వ లేదని చెబుతున్న ప్రభుత్వం ఎమ్మెల్యేలను విదేశాలకు ఎలా పంపుతుందని బీజేపీ సూటిగా ప్రశ్నిస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారైన ఎమ్మెల్సీ చెన్నరాజ హట్టిహొళి నేతృత్వంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు గోవాకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇటీవలే డికే ముఖ్యమంత్రి కావాలని చెన్నరాజ హట్టిహొళి గళమెత్తారు. దీంతో మంగళవారం రాత్రి కర్ణాటకలో కీలక రాజకీయ మార్పులు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.