రైళ్లలో టాయిలెట్ల శుభ్రత.. ఏఐతో తాట తీసే ప్లానింగ్
మొన్నటివరకు అత్యాధునిక సాంకేతికతగా చెప్పే ఏఐ (కృత్రిమ మేధ) ఇప్పుడు సామాన్యుడి జీవితాల్లోకి వచ్చేసింది.;
మొన్నటివరకు అత్యాధునిక సాంకేతికతగా చెప్పే ఏఐ (కృత్రిమ మేధ) ఇప్పుడు సామాన్యుడి జీవితాల్లోకి వచ్చేసింది. నిన్నటివరకు కష్టం.. క్లిష్టం అనుకున్న పనుల్ని ఏఐతో ఇట్టే పూర్తి చేసే దిశగా అడుగులు పడ్డాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని రైల్వేశాఖ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల తరబడి ఆచరణలో సాధ్యం కాని పనిని ఏఐతో పని ఎగ్గొట్టే ఉద్యోగుల తాట తీసే ప్రోగ్రాం ఒకటి చేపట్టింది. రైళ్లలో ప్రయాణించే వారిలో అత్యధికులు టాయిలెట్ల శుభ్రత మీద తరచూ ఫిర్యాదులు చేస్తుంటారు. రైళ్లలో టాయిలెట్లు ఎప్పటికి బాగుపడవా? అని తిట్టిపోసే వారికి కొదవ లేదు.
అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఏఐను ఆయుధంగా వినియోగించనున్న విషయాన్ని ఈ మధ్యన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల వెల్లడించటం తెలిసిందే. రైల్వే పరిశుభ్రతకు కూడా ఏఐను ఉపయోగిస్తామని ఆయన చెప్పారు.మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ఆ విధానాన్ని తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైళ్లలో పరిశుభ్రత అన్నది రిజర్వు బోగీల్లో మాత్రమే కాదు.. సాధారణ బోగీల్లోనూ ఉండేలా రైల్వే శాఖ చర్యలు తీసుకొంటుంది.
ఇందులో భాగంగా తొలిదశలో దేశ వ్యాప్తంగా 100 రైళ్లలో ఏఐతో పైలట్ ప్రాజెక్టుగా ఏఐ సాంకేతికతను వినియోగిస్తారు. ఇందులో భాగంగా రైళ్లలో పరిశుభ్రత కోసం నియమించే క్లీనింగ్ సిబ్బందికి వారి మొబైల్ లో ఒక యాప్ ను ఇన్ స్టాల్ చేయిస్తారు. వారి హాజరు దగ్గర నుంచి.. వారు క్లీన్ చేయటానికి ముందు ఫోటోల్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్ చేసిన తర్వాత ఆయా ఫోటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ రెండు ఫోటోలను ఏఐ పరిశీలించి.. సేవల నాణ్యతను మదింపు చేస్తుంది. అంతేకాదు.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా టాయిలెట్ పరిశుభ్రత ఉందా? లేదా? అన్న విషయాన్ని ఏఐ టెక్నాలజీ చెక్ చేస్తుంది. ఒకవేళ శుభ్రత సరిగా లేకుంటే సంబంధిత సిబ్బందిని అలెర్టు చేస్తుంది. అయినప్పటికీ సిబ్బంది మాట వినని పక్షంలో వారి మీద ఫైన్ వేయటం జరుగుతుంది. మొత్తానికి సరైన అంశానికి సంబంధించిన సరైన టెక్నాలజీని వాడేందుకు వీలుగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. మొత్తంగా పని ఎగ్గొట్టే వారి తాట తీసే ప్రోగ్రాంకు ఏఐను ఆయుధంగా రైల్వేశాఖ వాడుతుందని చెప్పాలి.